మందుల్లేవ్‌..?

No medicines - Sakshi

ఇదీ ఉమ్మడి జిల్లాలోని సర్కారు దవాఖానాల్లో పరిస్థితి

ప్రతీ ఏడాది డ్రగ్స్, సర్జికల్‌ ఐటమ్స్‌ మిగులు కారణంగా ల్యాప్స్‌

అత్యవసరం పేరిట ఆస్పత్రుల్లో బయట నుంచి కొనుగోలు

అయినా పేద రోగులకు సాధారణ మందులు కూడా లేవనే సమాధానం

బయట దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో  పేద రోగులపై భారం

సాక్షి, ఆదిలాబాద్‌: సర్కారు దవాఖానాలకు ప్రభుత్వం నుంచి సరఫరా చేసే మందుల కోటా ప్రతీ ఏడాది మిగిలిపోయి ల్యాప్స్‌ అవుతున్నాయి. మరో పక్క ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు అత్యవసరంలో 20 శాతం మందులు బయట నుంచి కొనుగోలు చేసే అవకాశాన్ని మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయి. అయినప్పటికీ ధర్మాస్పత్రుల్లో సాధారణ మందులు కూడా లభించకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. కోటాలో మందులు మిగిలిపోతాయి.. అత్యవసరం పేరిట ఆస్పత్రి వర్గాలు మందులు కొనుగోలు చేస్తాయి.. అయినా పేద రోగులకు మాత్రం ఆస్పత్రిలో సాధారణ మందులు కూడా లభించవు.

దీంతో బయట మెడికల్‌లో పేద రోగులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డబ్బులు లేకనే చికిత్స, మందులు ఉచితంగా లభిస్తాయని రిమ్స్‌కు వస్తే ఈ పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నిత్యం కనిపిస్తోంది. పేద రోగులకు చికిత్స, మందులు పూర్థి స్థాయిలో ఉచితంగా అందజేయాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు.

ప్రతీ ఏడాది ఇదే పరిస్థితి..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో డ్రగ్స్‌ రూ.14.66 కోట్లకు గాను రూ.10.95 కోట్లు వినియోగించారు. రూ.3.70 కోట్ల విలువైన డ్రగ్స్‌ ల్యాప్స్‌ అయ్యాయి. రూ.4.04 కోట్లు సర్జికల్‌ ఐటమ్స్‌గాను రూ.3.31 కోట్లు వినియోగించగా, రూ. 72.92 లక్షల విలువైన సర్జికల్‌ ఐటమ్స్‌ మిగిలిపోయాయి. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ద్వారా ఏప్రిల్‌లో మందుల కోటాను విడుదల చేస్తారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రిమ్స్‌ ఆస్పత్రి, భైంసా, మంచిర్యాల, నిర్మల్‌ ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్‌), ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, సిర్నూర్, ఉట్నూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు(సీహెచ్‌సీ), నిర్మల్‌లోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్‌), ఉమ్మడి జిల్లాలోని 72 పీహెచ్‌సీలు, పట్టణ ప్రాంతాల్లోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లకు ప్రతి ఏడాది మందుల కోటా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ నుంచే మంజూరు అవుతుంది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు మందుల సరఫరా జరుగుతుంది. గత ఏడాది పరిస్థితే మళ్లీ జిల్లాలో కనిపిస్తోంది.

ఈ ఏడాది కూడా కేటాయించిన మందుల కోటా మిగిలిపోతుండగా ఆస్పత్రుల్లో మాత్రం పేదలకు మందులు లభించని పరిస్థితి. ఈ తారతమ్యాన్ని పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే మందుల కోటాను పెంచాల్సి ఉంది. ఈ–ఔషధి, ఈ–ఆస్పత్రి పేరిట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటునప్పటికీ పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య చికిత్సలతోపాటు మందులు లభించినప్పుడే దానికి సార్థకత ఉంటుంది.

మందుల కొనుగోలులో అక్రమాలు
ప్రతి ఏడాది మూడు నెలలకు ఓసారి నాలుగు కోటాల్లో మందులను ఆస్పత్రులకు విడుదల చేస్తారు. ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిల్లో ఈ మందులను విడుదల చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి కావాల్సిన మందులు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో అందుబాటులో లేని పక్షంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు కోటాపై 20 శాతం మందులు బయట నుంచి కొనే అవకాశం ఉంది. బయట నుంచి కొనే మందుల విషయంలో ఆస్పత్రిల్లో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు.

ఈ నేపథ్యంలో ఒక ఆస్పత్రికి డిమాండ్‌ ఉన్న మందులు, మరో ఆస్పత్రిలో అవే మందులు వృథాగా ఉంటే ఆ ఆస్పత్రి నుంచి ఈ ఆస్పత్రికి మందులను తరలించే చెయిన్‌ సిస్టమ్‌ ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గిరిజనులు అత్యధికంగా ఉండే ఆసిఫాబాద్, ఖానాపూర్, ఉట్నూర్‌ వంటి ఆస్పత్రుల్లోనూ మందుల కోటా పెద్ద ఎత్తున మిగిలిపోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ఎంత అవసరమో అంతే కొంటాం..
సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో అందుబాటులో లేని మందులను బయట నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎంత అవసరమో అంత మేరకే కొంటాం. రిమ్స్‌ కొనుగోలు కమిటీ అనుమతి మేరకు మందులను కొనుగోలు చేస్తాం. కోటాపై 20 శాతం కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. మందుల వినియోగం పై ప్రతి ఏడాది ఆడిట్‌ నిర్వహించడం జరుగుతుంది.
 – డాక్టర్‌ అశోక్, రిమ్స్‌ డైరెక్టర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top