‘కంటి వెలుగులు’ ఎప్పుడో?

No clarity on the eye testing program schedule in the state - Sakshi

రాష్ట్రంలో కంటి పరీక్షల కార్యక్రమం షెడ్యూల్‌పై అస్పష్టత 

సాక్షి, హైదరాబాద్‌: కంటిచూపు సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు, వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘తెలంగాణ కంటి వెలుగు’ కార్యక్రమంపై స్పష్టత రావడంలేదు. వేసవి సెలవుల్లోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం భావించినా ఏర్పాట్ల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ చూపుతున్న నిర్లక్ష్యం కార్యక్రమం అమలుపై ప్రభావం చూపుతోంది. కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వైద్య సేవలు, కళ్లద్దాలను పంపిణీ చేసేందుకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయలేదు.

దృష్టి లోపాలు ఉండే వారి సంఖ్య ఎంత ఉంటుందనే అంచనాతో వైద్య, ఆరోగ్యశాఖ 40 లక్షల కళ్లద్దాల కొనుగోలుకు ఆమోదం తెలపగా తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) మార్చిలోనే 40 లక్షల కళ్లాద్దాల సెట్లను కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచింది. అయితే ఇప్పటికి 1.40 లక్షల కళ్లద్దాల సెట్లు మాత్రమే రాష్ట్రానికి చేరాయి. టెండర్లు పిలిచిన సంఖ్యలో కళ్లద్దాలు చేరిన తర్వాతే పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం వేసవిలోనే రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించడం సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.

అలాగే పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వైద్య నిపుణులు, సిబ్బంది, పరికరాలు ఇంకా సిద్ధం కాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెలాఖరుకు కూడా కంటి పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కళ్లద్దాల కొనుగోలు, పరీక్షల నిర్వహణ, పరికరాలు, తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకం, సిబ్బంది శిక్షణ, పరీక్ష కేంద్రాల ఏర్పాట్లకు రూ. 100 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపారు. నిధుల విడుదల విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని వైద్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top