దుబాయ్‌లో బీర్కూర్‌ వాసి మృతి  | Nizamabad District Dude Dies In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో బీర్కూర్‌ వాసి మృతి 

Jan 31 2019 10:21 AM | Updated on Jan 31 2019 10:21 AM

Nizamabad District Dude Dies In Dubai - Sakshi

రోదిస్తున్న కుటుంబీకులు నీరడి సాయిలు(ఫైల్‌)  

బీర్కూర్‌(బాన్సువాడ): మండల కేంద్రానికి చెందిన నీరడి సాయిలు(27) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మృతుడి భార్య గౌరవ్వ వివరించారు. సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడా లేక సహజ మరణమా అనే విష యం మాత్రం తెలియడం లేదు. చేసిన అప్పులు తీర్చేందుకు కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలి డబ్బులు సంపాదించేందుకు దుబాయ్‌ వెళ్లిన సాయిలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

నీరడి మైశయ్య, నీరడి మైశవ్వలకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా ఒక్కడే సాయిలు ఉన్నారు. ఆడపిల్లల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి వివాహం జరిగింది. మృతుడి తండ్రి గ్రామంలో కాందార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కల పెళ్లిళ్లు చేసినందుకు సుమారు రూ.3లక్షలు అప్పు కావడంతో వాటిని తీర్చేందుకు తెలిసిన వారి సహాయంతో దుబాయ్‌కి రెండేళ్ల క్రితం వెళ్లాడు. వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.లక్ష 50వేల అప్పు తీర్చాడని మృతుడి తల్లిదండ్రులు వివరించారు.
 
తండ్రిని కోల్పోయిన చిన్నారులు 
సాయిలు మృతి చెందడంతో చిన్నారుల రోదన చూసి కాలనీవాసులు దుఖసాగరంలో మునిగిపోయారు. సాయిలుకు ఇద్దరు పిల్లలు కాగా కుమార్తె ప్రవల్లిక, కుమారుడు చైతు ఉన్నారు. మృతుడి భార్య గౌరవ్వ తన భర్త ఫొటో పెట్టుకుని తీవ్రంగా రోదిస్తోంది.
 
ఫోన్‌ చేసిన 24 గంటల్లోనే దుర్వార్త 
మృతుడు నీరడి సాయిలు మంగళవారం ఉదయం సమయంలో భార్య గౌరవ్వ, పిల్లలతో దుబాయ్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాడని, 24 గంటలు గడువక ముందే చావు వార్త వినాల్సి వస్తోందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త ఫోన్‌లో మాట్లాడుతూ ఇక్కడ ఇబ్బందిగా ఉందని ఇంటికి వెళతామంటే పంపించడం లేదని ఇంటికి పంపించమంటే మరో 10 రోజులు ఆగాలని ఓనర్‌ చెబుతున్నాడని చెప్పాడని మృతుడి భార్య వివరించారు. ఇంతలోనే ఇలా జరగడం చూస్తుంటే అనుమానంగా ఉందని తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆమె తెలిపారు. అనారోగ్యం కూడా ఏమి లేదన్నారు. తమకు ఎవరు సరిగ్గా సమాచారం ఇవ్వడం లేదని అన్నారు.


మృతదేహం వచ్చేదెలా..? 
సాయిలు దుబాయ్‌లో మృతి చెందడంతో మృతదేహాన్ని గ్రామానికి ఎలా తీసుకురావాలో తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అక్కడ తెలిసిన వారు ఎవరూ లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం కోసం ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలనే విషయాలు తెలియడం లేదని మృతి వివరాలు సైతం పూర్తిగా తెలియడం లేదని అన్నారు. మృతదేహం కోసం ఎన్ని రోజులు వేచి చూడాలో కూడా తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement