breaking news
Dude died
-
దుబాయ్‌లో బీర్కూర్ వాసి మృతి
బీర్కూర్(బాన్సువాడ): మండల కేంద్రానికి చెందిన నీరడి సాయిలు(27) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మృతుడి భార్య గౌరవ్వ వివరించారు. సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడా లేక సహజ మరణమా అనే విష యం మాత్రం తెలియడం లేదు. చేసిన అప్పులు తీర్చేందుకు కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలి డబ్బులు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లిన సాయిలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నీరడి మైశయ్య, నీరడి మైశవ్వలకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా ఒక్కడే సాయిలు ఉన్నారు. ఆడపిల్లల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి వివాహం జరిగింది. మృతుడి తండ్రి గ్రామంలో కాందార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కల పెళ్లిళ్లు చేసినందుకు సుమారు రూ.3లక్షలు అప్పు కావడంతో వాటిని తీర్చేందుకు తెలిసిన వారి సహాయంతో దుబాయ్‌కి రెండేళ్ల క్రితం వెళ్లాడు. వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.లక్ష 50వేల అప్పు తీర్చాడని మృతుడి తల్లిదండ్రులు వివరించారు. తండ్రిని కోల్పోయిన చిన్నారులు సాయిలు మృతి చెందడంతో చిన్నారుల రోదన చూసి కాలనీవాసులు దుఖసాగరంలో మునిగిపోయారు. సాయిలుకు ఇద్దరు పిల్లలు కాగా కుమార్తె ప్రవల్లిక, కుమారుడు చైతు ఉన్నారు. మృతుడి భార్య గౌరవ్వ తన భర్త ఫొటో పెట్టుకుని తీవ్రంగా రోదిస్తోంది. ఫోన్ చేసిన 24 గంటల్లోనే దుర్వార్త మృతుడు నీరడి సాయిలు మంగళవారం ఉదయం సమయంలో భార్య గౌరవ్వ, పిల్లలతో దుబాయ్ నుంచి ఫోన్లో మాట్లాడాడని, 24 గంటలు గడువక ముందే చావు వార్త వినాల్సి వస్తోందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడ ఇబ్బందిగా ఉందని ఇంటికి వెళతామంటే పంపించడం లేదని ఇంటికి పంపించమంటే మరో 10 రోజులు ఆగాలని ఓనర్ చెబుతున్నాడని చెప్పాడని మృతుడి భార్య వివరించారు. ఇంతలోనే ఇలా జరగడం చూస్తుంటే అనుమానంగా ఉందని తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆమె తెలిపారు. అనారోగ్యం కూడా ఏమి లేదన్నారు. తమకు ఎవరు సరిగ్గా సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. మృతదేహం వచ్చేదెలా..? సాయిలు దుబాయ్‌లో మృతి చెందడంతో మృతదేహాన్ని గ్రామానికి ఎలా తీసుకురావాలో తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అక్కడ తెలిసిన వారు ఎవరూ లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం కోసం ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలనే విషయాలు తెలియడం లేదని మృతి వివరాలు సైతం పూర్తిగా తెలియడం లేదని అన్నారు. మృతదేహం కోసం ఎన్ని రోజులు వేచి చూడాలో కూడా తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
సౌదీలో ఏఎస్‌పేట వాసి మృతి
ఇచ్ఛాపురం : మున్సిపాల్టీ పరిధిలోని అమీన్సాహేబ్ పేట గ్రామానికి చెందిన సాలిన గోపాల్ (34) సౌదీఅరేబియాలో అనుమానస్పద స్థితిలో ఆదివారం మరణించాడు. ఈ విషాదవార్త ఆదివారం రాత్రి గోపాల్ కుటుంబీకులకు తెలిసింది. అయితే గోపాల్ మృతదేహాం తమ గ్రామానికి వస్తుందో తెలియక అతని కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. గోపాల్ తో కొంత కాలం పనిచేసి ప్రస్తుతం ఇక్కడే ఉన్న సాలిన సంతోష్, గోపాల్ కుటుంబ సభ్యులు, 3 వ వార్డు కౌన్సిలర్ సాలిన ఢిల్లీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.సౌది అరేబియా లొజుబేలా అనే ప్రాంతంలో ఎన్ఎస్హెచ్ కంపెనీలో గోపాల్ రిగ్గర్ గా పనిచేస్తున్నాడు. గతంలొ రెండేళ్ళు పనిచేసిన గోపాల్ కొద్దికాలం కిందటే దేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి గ్రామంలో కుటుంబం వద్ద ఉన్నాడు. రెండు నెలల కిందటే మరలా సౌదీ అరేబియా వెళ్ళాడు.ఆదివారం మధ్యాహ్నం విదుల్లో ఉండగా ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురై మరణించాడు.ప్రస్తుతం జుబేలాకు సమీపంలో ఉన్న దమల్ ప్రాంతంలోని ఉన్న ఆసుపత్రిలో ఆతని మృత దేహం ఉన్నట్లు చెప్పారు. సౌదీలొ ఉన్న స్థానిక కొళిగాం ప్రాంతానికి చెందిన రాపాక మోహనరావు తమకు సమాచారం అందించాడని తెలిపారు.గోపాల్ మృతికి సంబంధించిన ఎలా మరణించాడనే ఖచ్చితమైన సమాచారం లేదని,అక్కడ అధికారులు గోపాల్ మృతదేహాన్ని దేశానికి పంపిస్తారో లేదో అనే ఆందోళనలో కుటింబీకులు ఉన్నారు. జిల్లాలోని వివిద ప్రాంతాలకు చెందిన సుమారు 3 వందల మంది తెలుగువారు అక్కడ ఉన్నారని,గోపాల్ మృతదేహాన్ని భారతదేశం పంపాలని వారు అక్కడ యాజమాన్యం పై ఒత్తిడి చేసి,అవసరమైతే సమ్మెకు దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వదేశం తీసుకువచ్చేలా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. గోపాల్‌కు భార్య ఈశ్వరమ్మ కుమారులు హరి(8),హేంబాబు (5)కుమార్తె ప్రవల్లిక (6) తల్లి నూకాలమ్మ ఉన్నారు.