రైతుబంధు నగదు జమపై తకరారు

News on rythu bandhu checks distribution program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద చెక్కులు పంపిణీ చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బును ఎలా జమ చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. శనివారం ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసార«థి, కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా పలు బ్యాంకుల అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు 50 లక్షల మంది రైతులు యాసంగి పెట్టుబడికి అర్హులు కానున్నారు.

అయితే వీరందరి బ్యాంకు ఖాతాలు వ్యవసాయ శాఖ దగ్గర లేవు. కాకపోతే రైతు సమగ్ర సర్వేలో, ధరణి వెబ్‌సైట్‌ ఆధారంగా 50 శాతానికిపైగా రైతుల బ్యాంకు ఖాతాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇవి సరైనవేనా అనేది తెలియదు. ప్రతి గ్రామ రైతు బంధు లబ్ధిదారుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారులకు రెవెన్యూ సిబ్బంది అందించనున్నారు. ధరణికి అందుబాటులో ఉన్న రైతుల అకౌంట్‌ నం బర్లు కూడా అందులో ఉంచనున్నారు.

ఏఈవోలు ప్రతి రైతును సంప్రదించి అకౌంట్‌ నంబర్‌ సరైందో కాదో నిర్ధారించుకొని, లబ్ధిదారుడైన రైతు బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకోని వాటిని రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.  నేరుగా రైతుల అకౌంట్‌లో జమ చేస్తే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులతో పాటు బ్యాంకర్లు పేర్కొంటున్నారు. రైతు ఖాతాకు నగదు చేరకుండా మళ్లీ వెనక్కి వస్తే ఏ రైతుకు రైతుబంధు అందలేదో గుర్తించడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు వెల్లడించినట్లు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top