దిల్ జిగేల్.. | New Year's new-Trend | Sakshi
Sakshi News home page

దిల్ జిగేల్..

Jan 2 2015 1:49 AM | Updated on Oct 17 2018 4:29 PM

దిల్ జిగేల్.. - Sakshi

దిల్ జిగేల్..

ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు దాని సాధ్యాసాధ్యాలను ఆలోచించాలి.

ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు దాని సాధ్యాసాధ్యాలను ఆలోచించాలి. మనతో అవుతుందనుకుంటే పాటించాలి. కొంచెం కష్టమైనా పర్వాలేదనుకుంటే ట్రైచెయ్యాలి. కానీ సాధ్యం కాని దానిని ఎన్నుకుని తర్వాత మధ్యలోనే వదిలిపెట్టేయడం మంచిది కాదంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. కష్టతరమైనదైనా క్రమం తప్పకుండా చేస్తే అది అలవాటుగా మారుతుందనేది వారి అభిప్రాయం. ఇక ఈ సంవత్సరంలో తప్పకుండా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా..

సమయ పాలన
 
మనలో బోల్డంత నైపుణ్యం ఉండొచ్చు. చేయి తిరిగిన వ్యాపారి అయి ఉండొచ్చు. కానీ సమయపాలన లేకపోతే ఆయా రంగాల్లో రాణించడం కష్టం. సమయం మనకు ఎంత ముఖ్యమో.. మిగతా వారికీ అంతే అన్న సంగతి మర్చిపోకూడదు. పనులను వాయిదా వేసే విధానాన్ని వెంటనే విడనాడాలి. సమయాన్ని ఎంతబాగా ఉపయోగించుకుంటే అంత మేలు.
 
ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాంగా.. సమస్య వచ్చినప్పుడు చూద్దాం.. అని చాలామంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ తర్వాత సమస్య వచ్చినప్పుడు బెంబేలెత్తిపోతుంటారు. దీనిని తప్పించుకునేందుకు రోజుకు ఒక అరగంటైనా వ్యాయామం చేయాలి. మరి ఆలస్యమెందుకు ఈరోజు నుంచే ప్రారంభించేద్దాం. కొత్త ఏడాదిలో దీనిని అలవాటుగా మార్చుకుందాం.
 
 
పొదుపు


వచ్చింది ఖర్చులకే సరిపోవడం లేదు.. ఇక పొదుపా.. అని చాలామంది కొట్టి పారేస్తుంటారు. జీతం వచ్చిందా.. ఖర్చు చేశామా.. ఇదీ కొందరి ధోరణి. కానీ అవసరాలు చెప్పిరావు. కాబట్టి నెలకు కొంతయినా పొదుపు కోసం తీసేసి మిగతా సొమ్మును ఖర్చులకోసం వాడుకోవాలి. పొదుపు ఏరకంగా ఉండాలో మొదటే నిర్ణయం తీసుకోవాలి. వచ్చిన జీతంలో వీలైనంతగా పొదుపు కోసం కేటాయిస్తే భవిష్యత్ బంగారుమయమే.
 
 
సానుకూల దృక్పథం

చిన్నపాటి సమస్యలకే కుంగిపోవడం మంచి లక్షణం కాదు. సమస్య వచ్చినప్పుడు సానకూల దృక్పథంతో ఆలోచించాలి. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా మార్గాలు అన్వేషించాలి. ఆత్మీయులతో చర్చిస్తే పరిష్కారం సులభంగా దొరకొచ్చు. కాబట్టి సానుకూల దృక్పథంతో ముందుకుసాగితే విజయం కళ్లముందు సాక్షాత్కారమవుతుంది.
 
 
ఒత్తిడిని జయించాలి

వేగం సంతరించుకున్న జీవితాలలో ఒత్తిడి ఒక భాగమైపోయింది. దీనికి తలొగ్గామో ఇక అంతే.  ఒత్తిడిని ఎదుర్కొనే వ్యూహాలు రచించాలి. దానిపై పైచేయి సాధిస్తే విజయం సొంతమవుతుంది. ఇది చెప్పినంత సులభం కాకపోయినా సంకల్ప బలముంటే పెద్ద కష్టమేమీ కాదు. మంచివారితో స్నేహం చేయడం, నలుగురిలో కలిసిపోవడం, పుస్తక పఠనం, యోగా.. ఇలాంటి వాటితో ఒత్తిడిని తరిమికొట్టొచ్చు.  
 
 నిరంతర విద్యార్థిగా..

 ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఆ వేగాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. కంప్యూటర్‌తో పోటీపడాలి.  నేర్చుకునే ధోరణి పెరగాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలి. సమ యం లేదని, వీలుకాలేదనే సాకులను కట్టిపెట్టాలి. విషయాలు తెలుసుకోవడంలో నిరంతర విద్యార్థిగా ఉంటేనే సక్సెస్ సొంతమవుతుంది.
 
 కుటుంబంతో సరదాగా..


 వ్యక్తి విజయంలో కుటుంబం పాత్ర ఎంతో ఉంటుం ది. విధుల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులతో గడిపేందుకు కొంత సమయం కేటాయించాలి. వారానికోసారైనా కలిసి సినిమాకో, షికార్లకో వెళ్లాలి. అప్పుడే వారితో అనుబంధం మరింత పెనవేసుకుపోతుంది.
 
 
సాయంతో తృప్తి

ప్రపంచీకరణతో జీవన విధానంలో వేగం పెరిగింది. అపార్ట్‌మెంట్ల సంస్కృతి వచ్చాక ఎవరికి వారే అన్న ధోరణి పెరిగిపోయింది. సంవత్సరాల తరబడి ఒకదగ్గరే ఉంటున్నా పక్కంటి వారి పేర్లు కూడా తెలియని స్థితి. ఆ.. మనకెందుకులే అన్న ధోరణి. మొదట దీనిని విడనాడాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. బాధలో ఉన్నవారికి బాసటగా నిలవాలి. చేతనైనంత సాయం చేయాలి. సేవలో దొరికే తృప్తి మరెందులోనూ ఉండదు.
 
 మనిషిని చెడు ఆకర్షించినంత వేగంగా మంచి ఆకర్షించదు. కాబట్టి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఒక్కసారే కదా.. అని పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లకూడదు. దురలవాట్లకు ఒకసారి దగ్గరైతే వాటిని నుంచి బయటపడడం అంత తేలిక కాదు. కాబట్టి కొత్త ఏడాదిలో వాటి జోలికెళ్లనని ఒట్టుపెట్టుకోవాలి. మనసును అదుపులో ఉంచుకుంటే అదేమీ అసాధ్యం కాదు. ఇవన్నీ పాటిస్తే విజయం మీ సొంతమవుతుంది. ఆల్  ది బెస్ట్
 
 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement