మొబైక్‌.. ఇదో హైటెక్‌ సైకిల్‌

New style of bicycle on the roads of hyderabad - Sakshi

త్వరలో భాగ్యనగరం రోడ్డెక్కనున్న అత్యాధునిక సైకిళ్లు

మెట్రో రైల్‌ మార్గంలో సరికొత్త రవాణా వ్యవస్థ

అద్దె విధానం.. మొబైక్‌ యాప్‌తో నిర్వహణ

ప్రీపెయిడ్‌ పద్ధతిలో చెల్లింపులు

సాక్షి, హైదరాబాద్‌: లేటెస్ట్‌ మోడల్‌ కార్లు హల్‌చల్‌ చేసే విశ్వనగరం రోడ్లపై త్వరలో కిరాయి సైకిళ్లు కన్పించనున్నాయి! సైకిళ్లంటే మామూలు సైకిళ్లు కాదండోయ్‌.. హైటెక్‌ బైక్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా హైటెక్‌ హంగులతో రాబోతున్నాయి మొబైక్‌లు. బిజీ లైఫ్‌లో వ్యాయామం సాధ్యం కాని వారికి ఈ మొబైక్‌లతో ఆ చాన్స్‌ దొరకనుంది. వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఇంధనాన్ని పొదుపు చేయెచ్చు. త్వరలోనే మెట్రో రైల్‌ కారిడార్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త రకం సైకిళ్లను కొనాల్సిన పని లేదు. పాతకాలం రోజుల్లో మాదిరిగా గంటల లెక్కన కిరాయికి తీసుకోవచ్చు. మెట్రో రైలు దిగగానే చూడచక్కని డిజైన్‌తో ఆకట్టుకునే ఇంపోర్టెడ్‌ సైకిలెక్కి వెళ్లాల్సిన చోటికి వెళ్లొచ్చు. హైదరాబాద్‌ లాంటి ట్రాఫిక్‌లో సైకిళ్లెక్కడ వర్కవుట్‌ అవుతాయనే చింతక్కర్లేదు! ఏ గల్లీలో నుంచైనా షార్ట్‌కట్‌లు ఉంటాయి. చిన్నప్పుడు సైకిల్‌ తొక్కినా తొక్కకపోయిన ఆరోగ్యం, అవసరం కోసం ఇప్పుడు అలవాటు చేసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. 

చైన్‌లెస్‌.. డిస్క్‌ బ్రేకులు.. 
మెట్రో మార్గాల్లో అందుబాటులోకి రానున్న మొబైక్‌ను వినూత్న పద్ధతిలో రూపొందించారు. ఇది సైకిల్‌ మాదిరే ఉన్నా.. సాధారణ సైకిల్‌కు ఉన్నట్లు చైన్‌ ఉండదు. పంక్చర్‌లెస్‌ టైర్లు ఉం టాయి. బ్రేక్‌ సిస్టం అత్యంత భద్రమైనది. సాధారణ సైకిళ్ల బ్రేకులు కొన్ని సందర్భాల్లో సకాలంలో సహకరించకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తుంది. మొబైక్‌లో బ్రేక్‌ వ్యవస్థ మోటారు సైకిళ్ల మాదిరిగా డిస్క్‌ సిస్టంతో రూపొందించారు. ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఈ మొబైక్‌కు అత్యాధునిక పద్ధతిలో సీటింగ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. సరుకులు తీసుకెళ్లేందుకు వీలుగా స్ట్రాంగ్‌ బాస్కెట్‌ ఉంటుంది. 

విదేశాల్లో విజయవంతంగా.. 
ప్రస్తుతం సింగపూర్, జపాన్, మలేసియా, అమెరికా, చైనా, యూకే, ఇటలీ, థాయ్‌లాండ్‌ దేశాల్లోని 180 నగరాల్లో 70 లక్షల మొబైక్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. రోజుకు సగటున 2.5 కోట్ల మంది వీటిని నడుపుతుండగా.. 15 కోట్ల మంది ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. త్వరలో ఇండియాలోని మెట్రో నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు మొబైక్‌ సంస్థ ఏర్పాట్లు వేగవంతం చేసింది. భారత మార్కెట్‌కు అనుగుణంగా వీటిని మరింత అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. శనివారం హైటెక్స్‌లో జరిగిన అర్బన్‌ మొబిలిటీ ఇండియా–2017 సదస్సులో మొబైక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సాంకేతిక హంగులు...
మొబైక్‌ల నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు. ప్రస్తుతం ఇవి మెట్రో మార్గాల్లో అద్దె పద్ధతిలో అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో రైల్‌ స్టేషన్‌ నుంచి వీటిని కిరాయికి తీసుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకించి వ్యవస్థ ఏమీ ఉండదు. అంతా సాంకేతిక పరిజ్ఞానంతోనే ప్రక్రియ పూర్తవుతుంది. మొబైక్‌ను అద్దెకు తీసుకోవాలనుకున్న వారి వద్ద సెల్‌ఫోన్‌ తప్పనిసరిగా ఉండాలి. అందులో మొబైక్‌ యాప్‌ డౌన్‌లో చేసుకున్న తర్వాత మొబైక్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను చూపిన వెంటనే తాళం తెరుచుకుంటుంది. అప్పట్నుంచి అద్దె సమయం మొదలవుతుంది. గమ్యస్థానాన్ని చేరిన తర్వాత తిరిగి మొబైక్‌ స్టోర్‌లో నిలిపేయాలి. అద్దె చెల్లింపులకు సంబంధించి నిధులను యాప్‌లో ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలి. మొబైక్‌లు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టంతో నడుస్తాయి. అందుకు ప్రత్యేక వ్యవస్థ అందులో ఉంటుంది. మొబైక్‌లను దారిమళ్లించే ప్రయత్నం చేస్తే రైడర్‌ మొబైల్‌ నంబర్‌తో పాటు జీపీఎస్‌ సిస్టంతో ఇట్టే పట్టేయొచ్చు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top