మత్స్యరంగ అభివృద్ధికి నూతన పాలసీ: తలసాని

New Policy for Fisheries Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి కోసం త్వరలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. సోమవారం ఇక్కడ హరితప్లాజాలో మత్స్యశాఖ ఏర్పాటు చేసిన పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ను మంత్రి శ్రీనివాసయాదవ్, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ ముదిరాజ్, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ సువర్ణ, సలహాదారు విజయ్‌గుప్తాలతో కలసి ప్రారంభించారు. మత్స్యరంగంలోని వివిధ విభాగాలలో అనుభవం ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 40 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కమిషనర్‌ సువర్ణ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యరంగ అభివృద్ధికి, లక్షలాది మంది మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందిస్తోందన్నారు. 4 వేల మత్స్య సొసైటీల్లో సభ్యులుగా ఉన్న 2.90 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని మంత్రి వివరించారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో 100 శాతం గ్రాంటుపై అన్ని నీటి వనరులలో చేపపిల్లలను విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2016–17 సంవత్సరంలో రూ. 22 కోట్ల ఖర్చుతో 3,939 జలాశయాలు, చెరువుల్లో 27 కోట్ల చేపపిల్లలను, 2017–18 సంవత్సరంలో 51 కోట్ల చేపపిల్లలను 11,067 నీటి వనరులలో 42 కోట్ల రూపాయల ఖర్చుతో విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. వీలైనంత త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి నూతన పాలసీని రూపొందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆక్వా కల్చర్, సీడ్‌ హేచరీస్, ఎక్స్‌పోర్ట్, మార్కెటింగ్‌ తదితర రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉందన్నారు.  

ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి: సమ్మిట్‌లో ప్రముఖ కంపెనీలు  
మత్స్య ఉత్పత్తిని మెరుగుపర్చడం, నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించడం, మార్కెటింగ్‌ వ్యవస్థను పటిష్టపర్చడం అవసరమని ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణలో ఆక్వా రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. చేపలు, రొయ్యల పెంపకానికి నార్మల్, ఫుల్‌ కవరేజీ ఇన్సూరెన్స్‌ ఉందని, దీనికి ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. మత్స్యరంగానికి సరఫరా చేసే విద్యుత్‌ యూనిట్‌కు 3 రూపాయల 40 పైసలు తెలంగాణలో వసూలు చేస్తున్నారని, అదే ఒడిశాలో రూపాయి 25 పైసలు మాత్రమే వసూలు చేస్తున్నారని, దీనిని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. సింగిల్‌విండో విధానంలో మార్కెటింగ్‌ వ్యవస్థను నిర్వహించాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top