breaking news
Marketing system
-
ప్రకృతి పంట సరే, ప్రత్యేక మార్కెట్లేవి?
సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ఆదరణ రానురాను పెరుగుతోంది. రసాయనాలు లేని ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు కూడా ముందుకొస్తున్నారు. ఆరోగ్యం ముఖ్యమని భావించేవారు ధర కొంచెం ఎక్కువైనా పర్వాలేదంటూ ప్రకృతి వ్యవసాయోత్పత్తుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థ లోపించడం వల్ల రైతులు ఈ ఉత్పత్తులను ఎవరికి వారు రిటైల్‌గా ఏడాది పొడవునా అమ్ముకోవాల్సి వస్తోంది. అప్పులు తెచ్చి వ్యవసాయం చేసే చిన్న రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ‘ఒక్క ఆవుతో 30 ఎకరాల సాగు’ పేరుతో ‘సాక్షి’ దిన పత్రికలో వెలువడిన కథనంతో స్ఫూర్తి పొంది తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన ఔత్సాహిక రైతులు కొందరు 2012లో తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త సుభాష్ పాలేకర్ నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరయ్యారు. పంట పొలాల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇంటి పెరట్లో కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటామని పాలేకర్ చెప్పిన మాటలకు ఆకర్షితులై కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా అప్పట్లోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. అలా ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయం దినదినాభివృద్ధి చెంది రైతులు ఈ సాగు ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కోటనందూరు మండలం అల్లిపూడి, కొత్తకొట్టాం గ్రామాల్లో 30 మంది రైతులు సుమారు 100 ఎకరాల్లో గత ఏడేళ్లుగా ప్రకృతి సాగు చేస్తున్నారు. అల్లిపూడి గ్రామంలో రుత్తల నాగన్నదొర, చింతకాయల దేవుళ్ళు మాస్టారు, చింతకాయల కొండబాబు తదితర రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి, అపరాలు, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. కొత్తకొట్టానికి చెందిన చిటికెల బాపన్నదొర అనే రైతు ఎంతో ఆసక్తితో తనకున్న ఆరున్నర ఎకరాల పొలంలో వరి, పత్తి, పామాయల్, కూరగాయలు, బొప్పాయి పంటలను పండిస్తున్నారు. ఈ రైతులంతా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రసాయనిక ఎరువులు వాడకుండా పూర్తి స్థాయిలో దేశీ ఆవు పేడ, మూత్రాలతో మాత్రమే వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేల మెతకదనం, రంగు, వాసన మారింది ఆరేడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలంలో భూసారం క్రమంగా పెరుగుతోందని.. ఈ పొలంలో నేల మెతకదనం, రంగు, వాసన మారిందని చింతకాయల దేవుళ్లు మాస్టారు అన్నారు. ఈ భూమిలో గతంలో వేసిన పిండి(రసాయనిక ఎరువులు), పురుగుమందుల అవశేషాలు పోయేసరికి నేల మారిందని కూలీలే చెబుతున్నారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం పెద్దగా వేయకపోయినా ఈ పొలంలో పంట పండుతుంది. వచ్చే ఏడాది జీవామృతం వేయకపోయినా పంట పండుతుందనుకుంటున్నానని దేవుళ్లు మాస్టారు తెలిపారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆసక్తి ఉంటే, ఆచరణలో కొద్దిపాటి కష్టమైనప్పటికీ, ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలని ఈ రైతులు చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయోత్పత్తులు తింటే మనుషుల శరీరంలోని అనేక రుగ్మతలు దూరమవుతాయని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించకపోవడమే ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి అవరోధంగా నిలుస్తోందంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం నానా హడావుడి చేస్తుందే తప్ప తమకు ఏ విధమైన ప్రోత్సాహం అందించడం లేదని రైతులు చెబుతున్నారు. ఆత్మ, వ్యవసాయ శాఖ సిబ్బందికి అవసరమైనప్పుడు కేవలం ఫొటోలకు పరిమితమౌతున్నారు తప్ప వారితో ప్రకృతి వ్యవసాయదారులకు ఒనగూరిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో నిజమైన రైతులకు అవి చేరడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆసక్తి ఉన్నా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించడం లేదంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయోత్పత్తులకు ఇతోధికంగా రుణాలివ్వడం, ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం ద్వారా సహకరిస్తే ఈ వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు. – రెడ్డి చిట్టిబాబు, తుని టౌన్/ ఆలంక కుక్కుటేశ్వరరావు, కోటనందూరు, తూ.గో. జిల్లా ఎవరికి వాళ్లమే అమ్ముకుంటున్నాం.. నాకు తాండవ కాలువ కింద రెండెకరాల పొలం ఉంది. ఏడేళ్ల క్రితం తిరుపతి మహతి ఆడిటోరియంలో పాలేకర్ శిక్షణ గురించి ‘సాక్షి’లో చదివి అక్కడికి వెళ్లి శిక్షణ పొందాం. అప్పటి నుంచి వరి, అపరాలను పూర్థిస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నా. ఈ ఏడాది 5 సార్లు జీవామృతం పారించాను. ఎకరానికి 38 బస్తాల ధాన్యం పండింది. మినుము, పెసర వేశాం. మా వూళ్లో 30 ఎకరాల వరకు 18 మంది రైతులు సాగు చేస్తున్నాం. మమ్మల్ని చూసి కొత్తకొట్టాం గ్రామంలో రైతులూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. మార్కెటింగ్ సదుపాయం లేదు. కొందరు ఉద్యోగులు మంచి ధర ఇచ్చి కొంటున్నారు. వ్యాపారస్తులు బాగా తక్కువకు అడుగుతున్నారు. ఇవ్వటం ఇష్టం లేక ఒక్కో బస్తా ఏడాది పొడవునా బ్యాంకులు, ఎమ్మార్వో ఆఫీసు, ఆసుపత్రుల దగ్గర బియ్యాన్ని ఎవరికి వాళ్లమే అమ్ముకుంటున్నాం. రైతులతో సహకార సంఘం పెడదామని ప్రయత్నించా. రైతులు కలిసి రావటం లేదు. మొత్తంగా ఒకసారి అమ్మితేనే రైతు అవసరాలు తీరతాయి. ప్రభుత్వమే కొనాలి లేదా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. కొనుక్కునే వాళ్లను చూపించినా సరే. వ్యవసాయశాఖ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తే ఎక్కువ మంది రైతులు ఈ సాగు విధానంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సొంత ఆసక్తితోనే రైతులు వ్యవసాయం చేస్తున్నారు. – రుత్తల నాగన్నదొర (62812 87367), ప్రకృతి వ్యవసాయదారుడు, అల్లిపూడి, కోటనందూరు మం., తూ.గో. జిల్లా ప్రకృతి వ్యవసాయోత్పత్తులను ప్రభుత్వమే కొనాలి ఐదేళ్లుగా 3 ఎకరాల కౌలు పొలంలో వరి, అపరాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నా. మొదట్లో వరి దిగుబడి ఎకరానికి 20 బస్తాలకు తగ్గింది. ఏటా రెండేసి బస్తాల చొప్పున పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది 35 వరకు రావచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఈ ఆహారం విలువ తెలిసిన ఉద్యోగులు 25 కిలోల సన్నబియ్యం రూ. 1,300కు కొనుక్కెళ్తున్నారు. అయితే, ఒక్కో బస్తా అమ్ముకోవాల్సి వస్తున్నది. ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడి తక్కువే గానీ యాతన ఎక్కువ. తొలిదశలో దిగుబడి తగ్గి, క్రమంగా పెరుగుతుంది. అప్పుడు రైతు నిలబడాలంటే ప్రభుత్వం మండలం లేదా డివిజన్ స్థాయిలో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. ప్రకృతి వ్యవసాయదారులకు ప్రభుత్వం రుణాలు ఇస్తే ఎక్కువ మంది రైతులు ఈ వ్యవసాయంపై మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పంట భూమిని సారవంతం చేసుకునే వీలుంటుంది. హరిత విప్లవం పూర్వ పద్ధతులను కాపాడుకుంటూ, మనలను మనం సంరక్షించుకునే సదవకాశం ప్రకృతి వ్యవసాయం కల్పిస్తుంది. – చింతకాయల దేవుళ్ళు మాస్టారు (94412 10809), ప్రకృతి వ్యవసాయదారుడు, అల్లిపూడి, కోటనందూరు మం., తూ.గో. జిల్లా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎంతో నిష్ఠగా కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటుధర లభించడం లేదు. రైతులకు అందుబాటులో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. దిగుబడి వచ్చిన వెంటనే అమ్ముకునే పరిస్థితి లేక ఏడాదంతా ఇంటిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. – చిటికెల బాపన్నదొర (78932 03656), ప్రకృతి వ్యవసాయదారుడు, కొత్తకొట్టాం, కోటనందూరు మం., తూ.గో. జిల్లా ∙ పురుగు మందులుగా వాడే ఎమినోయాసిడ్, అగ్నాస్త్రం, నాటు ఆవుతో రైతు -
మత్స్యరంగ అభివృద్ధికి నూతన పాలసీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి కోసం త్వరలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సోమవారం ఇక్కడ హరితప్లాజాలో మత్స్యశాఖ ఏర్పాటు చేసిన పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను మంత్రి శ్రీనివాసయాదవ్, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ముదిరాజ్, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ సువర్ణ, సలహాదారు విజయ్‌గుప్తాలతో కలసి ప్రారంభించారు. మత్స్యరంగంలోని వివిధ విభాగాలలో అనుభవం ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 40 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కమిషనర్ సువర్ణ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యరంగ అభివృద్ధికి, లక్షలాది మంది మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందిస్తోందన్నారు. 4 వేల మత్స్య సొసైటీల్లో సభ్యులుగా ఉన్న 2.90 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని మంత్రి వివరించారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో 100 శాతం గ్రాంటుపై అన్ని నీటి వనరులలో చేపపిల్లలను విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2016–17 సంవత్సరంలో రూ. 22 కోట్ల ఖర్చుతో 3,939 జలాశయాలు, చెరువుల్లో 27 కోట్ల చేపపిల్లలను, 2017–18 సంవత్సరంలో 51 కోట్ల చేపపిల్లలను 11,067 నీటి వనరులలో 42 కోట్ల రూపాయల ఖర్చుతో విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. వీలైనంత త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి నూతన పాలసీని రూపొందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆక్వా కల్చర్, సీడ్ హేచరీస్, ఎక్స్పోర్ట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉందన్నారు. ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి: సమ్మిట్‌లో ప్రముఖ కంపెనీలు మత్స్య ఉత్పత్తిని మెరుగుపర్చడం, నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించడం, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపర్చడం అవసరమని ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణలో ఆక్వా రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. చేపలు, రొయ్యల పెంపకానికి నార్మల్, ఫుల్ కవరేజీ ఇన్సూరెన్స్ ఉందని, దీనికి ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. మత్స్యరంగానికి సరఫరా చేసే విద్యుత్ యూనిట్‌కు 3 రూపాయల 40 పైసలు తెలంగాణలో వసూలు చేస్తున్నారని, అదే ఒడిశాలో రూపాయి 25 పైసలు మాత్రమే వసూలు చేస్తున్నారని, దీనిని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. సింగిల్‌విండో విధానంలో మార్కెటింగ్ వ్యవస్థను నిర్వహించాలని సూచించారు. -
‘రైతుబంధు’ను విస్తరిస్తాం
⇒ ఇక 6 నెలల దాకా ధాన్యం ఉచిత నిల్వ ⇒ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మార్కెటింగ్ మంత్రి హరీశ్ ⇒ కంది రైతును కాపాడేందుకు రూ.5,050 మద్దతు ధర ⇒ ఇప్పటికే 9 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశాం ⇒ ఈ–నామ్‌తో జీరో వ్యాపారానికి అడ్డుకట్ట ⇒ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త మార్కెటింగ్ చట్టం ⇒ మార్కెటింగ్ వ్యవస్థను డీనోటిఫై చేస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకాన్ని మరింత విస్తరిస్తామని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ధాన్యాన్ని ఉచితంగా నిల్వ ఉంచుకునే వెసులుబాటును ప్రస్తుతమున్న మూడు నెలల నుంచి ఆరు నెలలకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మార్కెట్లు లేని చోట ప్యాక్స్, నాఫెడ్, ఎఫ్‌సీఐ, హాకా, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను భాగస్వామ్యం చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సోమవారం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. రాష్ట్రంలో మార్కెట్ల సంఖ్యను 150 నుంచి 180 దాకా పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది క్వింటాల్ రూ.8 వేలు పలికిన కంది ఈసారి రూ.4 వేలకు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఆఫ్రికా నుంచి కందుల దిగుమతికి కేంద్రం చేసుకున్న ఒప్పందమే దీనికి కారణమన్నారు. ‘‘తెలంగాణలో అధిక ఉత్పత్తి జరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకే కందులకు రూ.5,050 మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర చరిత్రలోనే అధికంగా 95 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటిదాకా రైతుల నుంచి 9 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశాం’’ అని మంత్రి వివరించారు. మా లక్ష్యం... మండలానికో గోదాం ప్రతి మండలానికీ ఒక గోదాం ఉండాలనేది తమ ఉద్దేశమని మంత్రి వివరించారు. ‘‘అందుకోసం 17 లక్షల మెట్రిక్ సామర్థ్యమున్న గోదాముల కోసం కేంద్రం నుంచి రూ.1,000 కోట్లు రుణంగా తీసుకున్నాం. ఇందులో కేంద్రం రూ.234 కోట్లు సబ్సిడీ కూడా ఇచ్చింది. గతంలో ఉల్లి ధర కిలో రూ.80 దాకా పెరిగినప్పుడు వినియోగదారులు అల్లాడారు. అప్పుడు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి అదే ధరకు 52,681 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.20కే విక్రయించాం’’ అని గుర్తు చేశారు. ఇకపై అలా జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46 కేంద్రాల్లో ఈ–నామ్‌లను అమలు చేస్తున్నామని, రాష్ట్రానికి మరో 16 ఈ–నామ్‌లు రావచ్చని చెప్పారు. ఈసారి ఒక్కో ఈ–నామ్‌కు రూ.75 లక్షలు కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. పాత ఈ–నామ్‌లకు ఈ పెంచిన సొమ్మును కేటాయించాలని కోరతామన్నారు. ‘‘నల్లగొండ జిల్లాలో బత్తాయి అధికంగా పండుతుంది. కానీ అక్కడ ఇప్పటివరకు బత్తాయి మార్కెటే లేదు. అందుకే అక్కడ బత్తాయి మార్కెట్ నెలకొల్పాం. జిల్లాలోని నకిరేకల్‌లో నిమ్మకాయల మార్కెట్ ప్రారంభించాం. దేవరకొండలో దొండకాయలు మార్కెటింగ్ చేస్తున్నాం’’ అని తాము తీసుకుంటున్న చర్యలను సోదాహరణంగా వివరించారు. కొత్త మార్కెట్ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే తేవాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు. వ్యవస్థను డీ నోటిఫై చేయాలని నిర్ణయించామని, పండ్లు, కూరగాయలను రైతులు ఎక్కడైనా విక్రయించుకునేలా చర్యలు తీసుకుం టామని వివరించారు. జిన్నింగ్ మిల్లులకు పరిశ్రమ హోదా ఇవ్వడంతో రాష్ట్రంలో కొత్తగా 35 కాటన్ మిల్లులు వచ్చాయని చెప్పారు.