‘రైతుబంధు’ను విస్తరిస్తాం | Sakshi
Sakshi News home page

‘రైతుబంధు’ను విస్తరిస్తాం

Published Tue, Feb 21 2017 2:35 AM

‘రైతుబంధు’ను విస్తరిస్తాం - Sakshi

ఇక 6 నెలల దాకా ధాన్యం ఉచిత నిల్వ
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌
కంది రైతును కాపాడేందుకు రూ.5,050 మద్దతు ధర
ఇప్పటికే 9 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశాం
ఈ–నామ్‌తో జీరో వ్యాపారానికి అడ్డుకట్ట
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త మార్కెటింగ్‌ చట్టం
మార్కెటింగ్‌ వ్యవస్థను డీనోటిఫై చేస్తామని వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: రైతు బంధు పథకాన్ని మరింత విస్తరిస్తామని మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ధాన్యాన్ని ఉచితంగా నిల్వ ఉంచుకునే వెసులుబాటును ప్రస్తుతమున్న మూడు నెలల నుంచి ఆరు నెలలకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మార్కెట్లు లేని చోట ప్యాక్స్, నాఫెడ్, ఎఫ్‌సీఐ, హాకా, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలను భాగస్వామ్యం చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సోమవారం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. రాష్ట్రంలో మార్కెట్ల సంఖ్యను 150 నుంచి 180 దాకా పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది క్వింటాల్‌ రూ.8 వేలు పలికిన కంది ఈసారి రూ.4 వేలకు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఆఫ్రికా నుంచి కందుల దిగుమతికి కేంద్రం చేసుకున్న ఒప్పందమే దీనికి కారణమన్నారు. ‘‘తెలంగాణలో అధిక ఉత్పత్తి జరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకే కందులకు రూ.5,050 మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర చరిత్రలోనే అధికంగా 95 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటిదాకా రైతుల నుంచి 9 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశాం’’ అని మంత్రి వివరించారు.

మా లక్ష్యం... మండలానికో గోదాం
ప్రతి మండలానికీ ఒక గోదాం ఉండాలనేది తమ ఉద్దేశమని మంత్రి వివరించారు. ‘‘అందుకోసం 17 లక్షల మెట్రిక్‌ సామర్థ్యమున్న గోదాముల కోసం కేంద్రం నుంచి రూ.1,000 కోట్లు రుణంగా తీసుకున్నాం. ఇందులో కేంద్రం రూ.234 కోట్లు సబ్సిడీ కూడా ఇచ్చింది. గతంలో ఉల్లి ధర కిలో రూ.80 దాకా పెరిగినప్పుడు వినియోగదారులు అల్లాడారు. అప్పుడు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి అదే ధరకు 52,681 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.20కే విక్రయించాం’’ అని గుర్తు చేశారు. ఇకపై అలా జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46 కేంద్రాల్లో ఈ–నామ్‌లను అమలు చేస్తున్నామని, రాష్ట్రానికి మరో 16 ఈ–నామ్‌లు రావచ్చని చెప్పారు.

ఈసారి ఒక్కో ఈ–నామ్‌కు రూ.75 లక్షలు కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. పాత ఈ–నామ్‌లకు ఈ పెంచిన సొమ్మును కేటాయించాలని కోరతామన్నారు. ‘‘నల్లగొండ జిల్లాలో బత్తాయి అధికంగా పండుతుంది. కానీ అక్కడ ఇప్పటివరకు బత్తాయి మార్కెటే లేదు. అందుకే అక్కడ బత్తాయి మార్కెట్‌ నెలకొల్పాం. జిల్లాలోని నకిరేకల్‌లో నిమ్మకాయల మార్కెట్‌ ప్రారంభించాం. దేవరకొండలో దొండకాయలు మార్కెటింగ్‌ చేస్తున్నాం’’ అని తాము తీసుకుంటున్న చర్యలను సోదాహరణంగా వివరించారు. కొత్త మార్కెట్‌ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే తేవాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు. వ్యవస్థను డీ నోటిఫై చేయాలని నిర్ణయించామని, పండ్లు, కూరగాయలను రైతులు ఎక్కడైనా విక్రయించుకునేలా చర్యలు తీసుకుం టామని వివరించారు. జిన్నింగ్‌ మిల్లులకు పరిశ్రమ హోదా ఇవ్వడంతో రాష్ట్రంలో కొత్తగా 35 కాటన్‌ మిల్లులు వచ్చాయని చెప్పారు.

Advertisement
Advertisement