తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం పండగ వాతావరణం కనిపించింది.
కొత్త మంత్రులను కలవడానికి తరలివస్తున్న అభిమానులు
భద్రత పెంచిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం పండగ వాతావరణం కనిపించింది. నూతనంగా మంత్రివర్గంలో స్థానం సంపాదించిన మంత్రుల బాధ్యతల స్వీకార కార్యక్రమాలతో కోలాహలంగా మారింది. మంత్రుల అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సచివాలయ పరిసరాలు సందడిగా మారాయి. కొత్తగా మంత్రి పదవులు పొందిన జూపల్లి కృష్ణారావు, చర్లకోల లక్ష్మారెడ్డి గురువారం మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. డి బ్లాకులోని కింది అంతస్తులో విద్యుత్ మంత్రి లక్ష్మారెడ్డికి, మొదటి అంతస్తులో పరిశ్రమల మంత్రి జూపల్లికి చాంబర్‌లు కేటాయించారు. మరో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారికంగా బాధ్యతలు చేపట్టకున్నా గురువారం సచివాలయంలోని తన చాంబర్‌కు వచ్చారు.
తనకు కేటాయించిన గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులతో ఆయన దాదాపు రెండు గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన శనివారం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిసింది. కాగా, అనుచరులు, కార్యకర్తలు కొత్త మంత్రులను కలిసేందుకు పోటీ పడుతుండడంతో కొద్దిరోజులు సచివాలయానికి సందర్శుకుల తాకిడి ఎక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రవేశం, భద్రత చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కాగా, వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌లు ఇంకా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. వారికి సచివాలయంలో ఇంకా చాంబర్లు ఖరారు కాలేదు.
పార్కింగ్ చిక్కులు...
తెలంగాణ సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందికరంగా మారింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో పార్కింగ్ ప్రదేశాలు కిటకిటలాడుతున్నాయి. స్థలం సరిపోక వాటిని బయటకు తీయడం సమస్యగా మారుతోంది. ముఖ్యంగా కార్ల పార్కింగ్ వద్ద ఈ సమస్య కనిపిస్తోంది. మంత్రులు ఉండే డీ బ్లాక్‌కు అధికారులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో కార్లలో వస్తున్నారు. వీరంతా డి బ్లాక్ ఎదురుగా వాహనాలు నిలుపుతున్నారు. దీంతో స్థలం సరిపోక ఏ ఒక్క వాహనం బయటకు తీయాలన్నా మిగతా వాహనాలన్నింటినీ కదిలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి సచివాలయంలోని హెలీప్యాడ్ ప్రాంతంలో కార్ల పార్కింగ్ కోసం ప్రభుత్వం అనుమతించింది. అయితే మంత్రుల చాంబర్‌లకు హెలీప్యాడ్ దూరంగా ఉందనే కారణంతో సందర్శకులంతా కార్లను నేరుగా డీ బ్లాక్ వరకూ తెస్తుండడమే సమస్యకు అసలు కారణమని అధికారులు చెపుతున్నారు.
ప్రతి ఒక్కరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఇంద్రకరణ్‌రెడ్డి
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇంటి సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణశాఖ నూతన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8.21 లక్షల ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో ఉందని వీటన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. గురువారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సీఐడీ విచారణ అనంతరం నివేదిక అందాక ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.