మైక్రో బ్రూవరీల ఏర్పాటుపై హరీశ్‌రావు అసత్య ఆరోపణలు
వాటి అనుమతులకు సంబంధించి ఒక్క ఫైల్ కూడా నా దగ్గరకు రాలేదు
బీఆర్‌ఎస్ హయాంలో రూపొందించిన నిబంధనలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి.. దొంగే దొంగ అని అరిచినట్టుగా హరీశ్ తీరు
ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు విషయంలో అవినీతి జరుగుతోందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు చేసిన ఆరోపణలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రూవరీల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా సంస్థలకు ఉన్న భూ లభ్యత, మౌలిక వసతులపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే అప్పుడు వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
అసలు ఆ నివేదికలే రానప్పుడు అనుమతులు ఎక్కడివని, అందులో అవినీతి ఎక్కడిదని ప్రశ్నించారు. బుధవారం రాత్రి రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూపల్లి మాట్లాడారు.
కాంగ్రెస్ కొత్త చట్టం ఏమీ తేలేదు..
‘మైక్రో బ్రుూవరీలకు సంబంధించి 2015 ఆగస్టు 28న జీవో నంబర్ 151 జారీ చేస్తూ నిబంధనలు రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బ్రూవరీలకు సంబంధించి కొత్త చట్టం ఏమీ తేలేదు. బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ జీవో ప్రకారమే 2016 జూలై 1న 20 బ్రూవరీలకు అనుమతి ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు మైక్రో బ్రూవరీలకు అనుమతుల కోసం నా వద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదు. సంబంధిత శాఖకు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
అప్పుడు 50 దరఖాస్తులు వస్తే 20కి మాత్రమే అనుమతులు ఇచ్చారు. వాటికి లాటరీ పద్ధతి పాటించారా? గతంలో 105 ఎలైట్ బార్లకు అనుమతి ఇచ్చారు. 2016 – 2023 మధ్య ఈ ఎలైట్ బార్లకు కూడా లాటరీ ద్వారా కాకుండా నచి్చన వారికి అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవాలు ఇలా ఉంటే అవగాహన రాహిత్యంతో హరీశ్‌రావు మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పులన్నీ వాళ్లు చేసి మాపై బురదజల్లుతున్నారు. దొంగే దొంగ అని అరిచినట్టుగా హరీశ్‌రావు తీరు ఉంది..’ అని జూపల్లి మండిపడ్డారు.
ఎక్సైజ్ ఆదాయం పెంచుకున్నారు..
‘బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ వార్షిక ఆదాయం రూ.10,012 కోట్లు మాత్రమే ఉంటే, 2014 –2023 వరకు తొమ్మిదేళ్లలో దాన్ని రూ.34,869 కోట్లకు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024–25లో ఎక్సైజ్ ఆదాయం రూ.34,603 కోట్లు మాత్రమే వచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కంటే మా ప్రభుత్వంలో సుమారు రూ.250 కోట్ల ఆదాయం తగ్గింది.
తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది ఎవరో ఈ లెక్కను బట్టి చెప్పాలి..’ అని జూపల్లి అన్నారు. ’వాటాలు పంపిణీ చేసుకుంది మీరు. కాసులకు కోసం కక్కుర్తి పడింది మీరు. మీ బాగోతం, వాటాలపై చర్చకు సిద్ధమా?..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీస్తుండటంతో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


