బీజేపీ అభ్యర్థుల ఎంపికలో మార్పులు?

New Candidate BJP MLA Seats Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ఎంపికలో అనూహ్య మార్పులు.. చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు జుక్కల్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నాయుడు ప్రకాష్‌ పేరు పరిశీలనలో ఉంది. తాజాగా కాంగ్రెస్‌ టికెట్‌ ఆ శించి భంగపడిన అరుణతార పేరు తెరపైకి వ చ్చింది. ఆమె శుక్రవారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుతో భేటీ అయ్యారు. అరుణతార నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నా రు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలైన అరుణతార జుక్కల్‌ టికెట్‌ హామీతోనే బీజేపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 ఉమ్మడి జిల్లా పరిధి లో నాలుగు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఇంకా తేల్చలేదు. జుక్కల్‌తో పాటు, బాల్కొండ, బాన్సు వాడ, బోధన్‌ స్థానాల నుంచి బరిలోకి దిగే అభ్యర్థుల స్పష్టత లేదు. బీజేపీ ప్రకటించిన మొద టి జాబితాలో నిజామాబాద్‌ రూరల్‌కు గడ్డం ఆనంద్‌రెడ్డి, ఆర్మూర్‌ స్థానానికి వినయ్‌ కుమార్‌ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ప్రకటించిన విషయం విదితమే. రెండో జాబితాలో నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేరు ఖరారైంది. తాజాగా గురువారం రాత్రి విడుదల చేసిన మూడో జాబితాలో ఎల్లారెడ్డి టికెట్‌ ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బానాల లక్ష్మారెడ్డికి దక్కింది. ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థులెవరో తేలాల్సి ఉంది.

బాల్కొండ తెరపైకి ఎన్‌ఆర్‌ఐ..?
బాల్కొండ బీజేపీ అభ్యర్థిగా అనూహ్యంగా ఓ ఎన్‌ఆర్‌ఐ పేరు పరిశీలనలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ముప్కాల్‌ మండలానికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ బీజేపీ నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే ఒకరిద్దరు పేర్ల  ప్రచారం కూడా జరిగింది.
 
నేడు స్పష్టత వచ్చే అవకాశం
నామినేషన్లు దాఖలు చేసేందుకు నిర్ణయించిన గడువు ముంచుకొస్తోంది. కేవలం మూడు రోజులే గడువుంది. ఈనెల 19తో గడువు ముగుస్తుంది. ఈ తరుణంలో అభ్యర్థులెవరో తేలకపోవడంతో ఆ పార్టీలో అయోమయం నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థులు తేలాకే బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top