సింగరేణిలో కొత్త కేడర్‌

New cadre in Singareni - Sakshi

సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి..

సాక్షి, హైదరాబాద్‌: దశాబ్ద కాలంగా నలుగుతున్న సింగరేణి ఉద్యోగుల కేడర్‌ స్కీం సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. ఉద్యోగులకు కొత్త కేడర్‌ స్కీం అమలు, 11 రకాల అలవెన్సులను 30 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు, 2017 డిసెంబర్‌ వరకు బదిలీ వర్కర్లుగా పనిచేసిన 900 మంది కార్మికులను జనరల్‌ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించేందు సింగరేణి బొగ్గు గనుల యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ గుర్తింపు కార్మిక సంఘం, యాజమాన్యం మధ్య గురువారం జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల 20 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నట్లు సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందాలను సెప్టెంబర్‌ 1 నుంచి అమలుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తింపు కార్మిక సంఘం విజ్ఞప్తి మేరకు కార్మిక సంఘాలు, అధికారుల కమిటీతో కోలిండియాలో అమలు చేస్తున్న కేడర్‌ స్కీంపై యాజమాన్యం అధ్యయనం జరిపించి కొత్త కేడర్‌ స్కీంకు రూపకల్పన చేసింది.  

14 కేడర్లలో 35 హోదాలకు వర్తింపు 
సింగరేణిలోని 14 రకాల కేడర్ల పరిధిలోని 35 హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త కేడర్‌ స్కీంతో లబ్ధి కలగనుంది. ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, జేఎంటీఈలు, డ్రిల్లర్లు, ఫోర్మెన్లు, పారామెడికల్‌ సిబ్బంది, సివిల్‌ శాఖ ఉద్యోగులు.. ఇలా 14 కేడర్లలో 35 హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తదుపరి ప్రమోషన్, అలవెన్సుల వర్తింపుతోపాటు పై కేడర్‌కు పదోన్నతి పొందేందుకు 2 నుంచి 3 ఏళ్లనిరీక్షణ సమయం తగ్గనుంది. ఏళ్ల తరబడి ఎదుగూ బొదుగూ లేక ఒకే కేడర్లో ఉన్న వారికి ఇప్పుడు త్వరితగతిన ప్రమోషన్లు రానున్నాయి. గత కొన్నేళ్లుగా పెరుగుదలకు నోచుకోని 11 రకాల అలవెన్సులను సమగ్ర అధ్యయనం తర్వాత వాటి స్థాయిను బట్టి 30 శాతం నుంచి 100 శాతం వరకు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో సంస్థపై ఏటా రూ.5 కోట్ల అదనపు భారం పడనుంది.  

ఒకేసారి 900 మందికి జనరల్‌ మజ్దూర్‌ గుర్తింపు 
సింగరేణి గనుల్లో కార్మికుల ఉద్యోగ ప్రస్థానం బదిలీ వర్కర్‌ స్థాయి నుంచి ప్రారంభం అవుతుంది. బదిలీ వర్కర్‌కు ఏడాది తర్వాత జనరల్‌ మజ్దూర్‌ హోదా కల్పించాల్సి ఉంటుంది. తెలంగాణ రాక ముందు దాదాపు నాలుగైదు ఏళ్లుగా బదిలీ వర్కర్లకు జనరల్‌ మజ్దూర్‌గా పదోన్నతి కల్పించలేదు. సీఎం కేసీఆర్‌ హామీ మేరకు గతేడాది 2,178 మందికి జనరల్‌ మజ్దూర్లుగా గుర్తించారు. 2017లో 190–240 మస్టర్లు ఉన్న మరో 900 మంది బదిలీ వర్కర్లను సైతం జనరల్‌ మజ్దూర్లుగా గుర్తించేందుకు తాజాగా యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది శిక్షణ కాలం పూర్తి చేసుకున్న జేఎంటీఈ, ఫోర్మెన్‌ లాంటి ట్రైనీలకు కూడా బోనస్‌ చెల్లించాని సింగరేణి సీఎండీ నిర్ణయం తీసుకున్నారు. రూ.3 కోట్ల లాభాల బోనస్‌ రూపంలో వీరికి చెల్లించనున్నారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పెండింగ్‌లో ఉంచబోమని, సత్వరమే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top