‘సాగర్‌’పై నెహ్రూకు మమకారం

Nehru Showed Special Interest On Nagarjuna Sagar Project - Sakshi

సాక్షి, నాగార్జునసాగర్‌ : బాలబాలికలన్నా, గులాబీ పుష్పాలన్నా భారత తొలిప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకు ఎంతో ప్రీతి. ఏ సభలోనైనా బాలబాలికలను ముద్దాడిన తర్వాతనే వేదికను అలంకరించేవారు. 1955 డిసెంబర్‌ 10వతేదీన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి తెలుగు ప్రజానీకం గుండెల్లో నెహ్రూ నిలిచిపోయారు. ఆధునిక భారత నిర్మాణంలో భాగంగా ఈ మానవతా మందిరానికి శంకుస్థాపన చేసిన వారంటే విజయపురి (నేటినాగార్జునసాగర్, నందికొండ) విద్యార్థులకు పౌరులకు ఎంతో అభిమానమే. నెహ్రూకు కూడా నాగార్జున సాగరమంటే ప్రత్యేక అభిమానమే. డ్యాం నిర్మాణానికి శ్రమశక్తి ప్రారంభమైన తొలిరోజులవి.

ఉద్యోగులు, కార్మిక సంతానానికి డ్యాం అథారిటీయే విద్యాలయాలను ప్రారంభించింది. 1957 నవంబర్‌ నెలలో నాగార్జునసాగర్‌ చిన్నారి విద్యార్థులు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకు జన్మదిన శుభాకాంక్షలు పంపారు. ఆయన ఎంతో పొంగిపోతూ స్వదస్తూరితో వారికి లేఖ రాశారు. నా జన్మదినం సందర్భంగా మీరు పంపిన శుభాకాంక్షలకు నేను మిక్కిలి కృతజ్ఞుడను. మీ ఆధారాభిమానాలకు నేనెంతో ఉప్పొంగి పోయాను. నేను అందుకున్న శుభాకాంక్షలకు నాలో కల్గిన భావాలను ప్రకటించుటకు తగిన పదాలు కూడా లభించడం లేదు అంటూ ముగించారు. ఎంతమంచి మనసు ఆయనది ఈ లేఖ నేటికీ నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో భద్రంగా ఉంది.

ఇది ఈ విద్యాలయానికి అమూల్య సంపదే. రాష్ట్రంలో వారి దస్తూరితో చిన్నారులను ఉద్దేశించి రాసిన లేఖ మరే విద్యాలయంలోనే లేదని భావించవచ్చు. భావిభారత నిర్మాణానికి నెహ్రూ సూత్రధారులని భావించేవారు. అందుకనే ఆసేతు హిమాచల పర్యంతం వారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటూ చాచా నెహ్రూను స్మరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తారు. 

సాగర్‌తో మరికొన్ని అనుబంధాలు
1955 డిసెంబర్‌ 10న సాగర్‌డ్యాం శంకుస్థాపన సందర్భంగా ‘నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం పవిత్రకార్యంగా భావిస్తున్నాను. భారతావనిలో నిర్మాణం చేసుకుంటున్న ఆధునిక దేవాలయాలకు ఇది చిహ్నం. మానవతా మందిరానికే ఈ శంకుస్థాపన’ అంటూ ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు. నెహ్రూకు సాగరంటే ఎంత ప్రీతో సాగర్‌ వాసులకు అయన అంటే అంతే. 1962లో రక్షణ నిధికి ఆయన ఇచ్చిన పిలుపునకు విజయపురి పౌరులు స్పందించి నవంబర్‌ 7వ తేదీన రూ.1,00,001లు పంపారు.

1963డిసెంబర్‌ 6వతేదీన డ్యాం అథారిటీ నిర్వహణలో ఉన్న ఆస్పత్రికి చాచానెహ్రూ సతీమణి పేరు కమలానెహ్రూ ఆసుపత్రిగా ఇందిరాగాంధీచే సాగర్‌ వాసులు నామకరణం చేయించారు. కమలనెహ్రూ పేరిట మనరాష్ట్రంలో ఉన్న ఆస్పత్రి ఇదొక్కటే. తెలుగు ప్రజానీకం ఎంతో కృతజ్ఞత కలవారని నిరూపించుకోవడానికి సాగర్‌ కుడికాల్వకు జవహర్‌ కెనాల్‌గా నామకరణం చేశారు. ఆప్రేమతోనే హిల్‌కాలనీలోలని నెహ్రూపేరిట పార్కును నిర్మించి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top