‘కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణం తీర‌ని లోటు’ 

Nandamuri Balakrishna Condolence To Kodi Ramakrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కోడి రామ‌కృష్ణ‌గారు అనారోగ్యంతో క‌న్నుమూయ‌డం ఎంతో బాధాకరమన్న హీరో బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. శ‌తాధిక ద‌ర్శకుడిగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు చిత్ర సీమ‌కు అందించారని‌ పేర్కొన్నారు. ఎమోష‌న‌ల్ చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో కోడి రామ‌కృష్ణ‌గారు ముందు వ‌రుస‌లో ఉంటారని తెలిపారు. అలాగే ఆయ‌న వైవిధ్య‌మైన చిత్రాల‌ను కూడా అందించారన్నారు. ట్రెండ్‌కు త‌గిన‌ట్లు గ్రాపిక్స్ చిత్రాల‌ను కూడా అద్భుతంగా తెర‌కెక్కించారని.. ఆయ‌న‌తో క‌లిసి మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల క్రిష్ణ‌య్య‌, ముద్దుల మావ‌య్య, ముద్దుల మేన‌ల్లుడు, భార‌తంలో బాల‌చంద్రుడు, మువ్వ గోపాలుడు, బాల‌గోపాలుడు చిత్రాల‌కు ప‌నిచేశానని గర్తు చేసుకున్నారు. ఇలాంటి గొప్ప ద‌ర్శ‌కుడిని కోల్పోవ‌డం సినీ ప‌రిశ్రమ‌కు తీర‌ని లోటని.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని ప్రార్థించారు. ( ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత )

ఆయన మృతిపై స్పందించిన ప్రముఖులు..

ప్రముఖ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన తెలుగు చిత్ర సీమకు ఎనలేని కృషి చేశారు. ప్రధానంగా కుటుంబ కథా చిత్రాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి- వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

తెలుగు చిత్ర సీమ ఓ లెజెండ్‌ను కోల్పోయింది మిమ్మల్ని మిస్‌ అవుతున్నాము - జూ.ఎన్టీఆర్‌

చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి - కళ్యాణ్‌ రామ్‌

నాలాంటి ఎంతో మంది దర్శకులకు ఆయన ఆదర్శం. ఆయన మరణవార్త విని షాక్‌కు గురయ్యాను - అనిల్‌ రావిపూడి

కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. తెలుగు సినీరంగంలో తనదైన శైలితో ఎన్నోచిత్రాలను తెరకెక్కించి, 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. - కేసీఆర్‌

ఆయన మరణం చాలా బాధాకరం. ఆయన తెలుగు సినిమాకు చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి- మహేష్‌ బాబు

మహోన్నత వ్యక్తిని కోల్పోయాను. నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చారు. చిత్రసీమ గొప్పదర్శకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి- దేవీ శ్రీ ప్రసాద్‌

నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి మ‌ర‌ణం బాధాక‌రం. తెలుగు సినిమా ఓ మంచి ద‌ర్శ‌కున్ని కోల్పోయింది. తెర‌పై ఆయ‌న ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి ద‌ర్శ‌కుడు క‌న్నుమూయ‌డం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు. ఆయ‌న‌తో నేను కూడా కొన్ని సినిమాల‌కు ప‌ని చేసే గౌర‌వం ద‌క్కింది. శ్రీ కోడి రామ‌కృష్ణ గారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను- మంచు మోహ‌న్ బాబు 

ఆయన మరణం ఎంతో బాధాకరం. అంకితభావం కలిగిన దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమ మరో లెజెండ్‌ను కోల్పోయింది- శ్రీనువైట్ల

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి- రానా

హీరోలను, విలన్లను, విజువల్‌ ఎఫెక్ట్స్‌ను, భక్తిరస చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన నా ఫేవరెట్‌ డైరెక్టర్‌. తెలుగు చిత్ర సీమ ఓ లెజెండ్‌ను కోల్పోయింది- మెహర్‌ రమేష్‌

ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి- సాయి ధరమ్‌ తేజ్‌

నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారికి నమస్కారాలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి- బ్రహ్మాజి

ఆయన తరంలో ఆయన కూలెస్ట్‌. ఓ లెజెండ్‌ను కోల్పోయాం. మీరెప్పటికీ గుర్తుంటారు సర్‌- నాని

లెజెండరీ డైరెక్టర్‌ కోడి రామకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలి. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాము సర్‌- మారుతి 

కోడి రామకృష్ణ గారి మరణం తీరని లోటు. చిత్రసీమకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది. అరుంధతి, అమ్మోరు, మంగమ్మగారి మనవడు, అంకుశం లాంటి సినిమాలతో తన మార్క్‌ వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు బలం చేకూరాలి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి- లక్ష్మీ మంచు 

కోడి రామకృష్ణ మరణం తీరని లోటు. ఆయనతో నాకు ముప్పై ఏళ్ల అనుబంధం ఉంది. పని పట్ల ఎప్పుడూ అంకిత భావంతో ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి- చిరంజీవి

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి- శ్యాంప్రసాద్‌ రెడ్డి

ఆయన మరణవార్త విని తీవ్ర వేదనకు లోనయ్యాను. తెలుగు సినిమా ఓ మంచి దర్శకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలుపుతున్నాను- నిర్మాత, రాజ్యసభ సభ్యులు డా. టి. సుబ్బరామిరెడ్డి

కోడి రామకృష్ణ గారు ఓ సినీ లైబ్రరీ. ఆయన ఇక లేరు అనే విషయం తెలియగానే ఎంతో బాధపడ్డాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి- బోయపాటి శ్రీను

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top