
చేస్తున్నది తక్కువ.. చేయాల్సింది ఎక్కువ!
‘‘కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు అంతా కలిసి అభివృద్ధి చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 46 వేల చెరువులకు జలకళ తెచ్చేందుకు మిషన్ కాకతీయ మొదలు పెట్టాం.
రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
నల్లగొండ నుంచి వాటర్ గ్రిడ్‌కు శ్రీకారం
సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన నల్లగొండ జెడ్పీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: ‘‘కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు అంతా కలిసి అభివృద్ధి చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 46 వేల చెరువులకు జలకళ తెచ్చేందుకు మిషన్ కాకతీయ మొదలు పెట్టాం. దేశంలో మంచి రహదార్లు అంటే తెలంగాణలోనే ఉన్నాయన్న రీతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు చేస్తున్నది తక్కువ, చేయాల్సిందే ఎక్కువ ఉంది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్ మంగళవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వెనుక బడిన నల్లగొండ నుంచే వాటర్ గ్రిడ్‌కు శ్రీకారం చుడతానని, త్వరలోనే జిల్లాలో శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని తెలిపారు. ‘‘తెలంగాణది సంక్షేమ రాజ్యం.
రెండున్నరేళ్లలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తాం. ఇప్పటికే పెన్షన్లు పెంచాం. తం డాలను పంచాయతీలుగా మార్తుస్తున్నాం’’ అని వెల్లడించారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా బాలూనాయక్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. తెలం గాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటిం టికీ ప్రచారం చేయాలని నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కోరారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రసంగిస్తూ నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో గతంలో టీఆర్‌ఎస్ కొంత బలహీనంగా ఉండేదని, ఇప్పుడు పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.
బాలూనాయక్‌తో పాటు చింతపల్లి, రామన్నపేట, గుర్రం పోడు, అర్వపల్లి, నూతనకల్లు మండలాలకు చెందిన అయిదుగురు జెడ్పీటీసీ సభ్యులు, చింతపల్లి, చందంపేట, దేవరకొండ, మఠంపల్లి, నేరేడుచర్ల ఎంపీపీలు, 39 మంది ఎంపీటీసీ సభ్యులు, 45 మంది సర్పంచులు, ముగ్గురు సింగిల్ విండో చైర్మన్లు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.