‘గౌరవ’మేదీ..?

Nalgonda govt Schools Cooking Workers Salary Issues - Sakshi

సాక్షి, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, పాఠశాలకు వచ్చే పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. పథకం విజయవంతంగా సాగుతున్నా.. భోజనం వండి వడ్డించే కార్మికుల పరిస్థితి మాత్రం ఆగమ్యగోచరంగా ఉంది. నాలుగు నెలలుగా వీరికి గౌరవ వేతనం అందకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే అరకొర వేతనం కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో.. వారి అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ దసరాకైనా వేతనం అందుతుందని భావించిన వారికి ప్రభుత్వం నిరాశే మిగిల్చింది.

ఇచ్చేది రూ.వెయ్యి..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహం భోజనం వండిపెట్టే కార్మికులకు గౌరవ వేతనం రూ.1000 ఇస్తున్నారు. కార్మికులు భోజనం వండి పెట్టడడంతోపాటు వడ్డించాలి కూడా. ఇన్ని పనులు చేసినా వారికి ఇచ్చే వేతనం ఎంతో తక్కువ. అదికూడా పాఠశాలలు పునః ప్రారంభమైన జూన్‌ నుంచి కూడా అందడం లేదు. ఇచ్చే కొద్ది పాటి గౌరవ వేతనం కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అధికారులను అడిగినా వారు కూడా తెలియదని చెబుతున్నారు.

వంట పని మానేస్తున్న కార్మికులు..
వేతనాలు సక్రమంగా అందక.. బిల్లులు సరిగా విడుదల కాక చాలా మంది కార్మికులు విధుల నుంచి తప్పుకుంటున్నారు. బయట వేరే పనిచేసుకున్నా అధికంగా డబ్బు సంపాధించవచ్చని.. ఇక్క నెల రోజులు కష్టపడి పనిచేసినా ఇచ్చేది.. వెయ్యి రూపాయలని.. అదీ సక్రమంగా అందకపోవడంతో చేసేదిలేక చాలా మంది కార్మికులు పని మానేస్తున్నారు. అదేబాటలో మరికొందరు ఉన్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు.
 
జిల్లాలో 1700 మంది కార్మికులు..
జిల్లాలో మధ్యాహ్నా భోజన కార్మికులు దాదాపు 1700 మంది ఉన్నారు. వారు ప్రతి రోజు 1,11, 616 మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. అయితే 2010 నుంచి కార్మికులకు గౌరవ వేతనం ఇస్తున్నారు. అప్పటి నుంచి సక్రమంగా ఇవ్వడం లేదు. దీంతో వారి బాధలు వర్ణనాతీతం.

ఆశతో పనిచేస్తున్నాం
మేము ఏళ్లతరబడి పనిచేస్తున్నాం. నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. అది ఎటూ సరిపోవడం లేదు. ప్రభుత్వం జీతం పెంచకపోవతుందా అన్న ఆశతో పనిచేస్తున్నాం. ఇచ్చే జీతం కూడా నెల నెల ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీతం పెంచి.. సక్రమంగా విడుదల చేసిన మమ్ములను ఆదుకోవాలి. – రమణ, మధ్యాహ్న భోజన కార్మికురాలు

వంట పని మానేయమంటున్నారు..
నెలరోజులు కష్టపడి వంట చేస్తే అతి తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎన్నోసార్లు వేతనం పెరుగుతుందని ఎదురుచూశాం.. కానీ పెంచలేదు. వంట పని మానివేయమని ఇంట్లోవాళ్లు అంటున్నారు. ప్రభుత్వం అందరి ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తుంది. మాకు జీతాలైనా పెంచకపోతాతుందా.. అని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం వేతనాలు పెంచాలని కోరుతున్నాం.  – స్వప్నారాణి, కార్మికురాలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top