ఆడవాళ్లకు మాత్రమే! | Muslim Maternity Hospital serving from 50 years | Sakshi
Sakshi News home page

ఆడవాళ్లకు మాత్రమే!

Mar 4 2018 2:59 AM | Updated on Oct 9 2018 7:52 PM

Muslim Maternity Hospital serving from 50 years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుమారు 50 ఏళ్ల క్రితం ఓ హృదయవిదారక ఘటనతో ఆ ఆస్పత్రి ప్రారంభమైంది. ఏ ఉద్దేశంతో అయితే ఆ ఆస్పత్రి ప్రారంభమైందో.. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మహిళలతో మహిళల కోసం ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. అదే ముస్లిం మెటర్నిటీ జనానా అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌. దేశంలోనే కాక ప్రపంచంలోనే మహిళలచే మహిళల కోసం నిర్వహిస్తున్న ఆస్పత్రి ఇది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ మహిళలతో మహిళల కోసం నిర్వహిస్తున్న ఓ ఆస్పత్రి.. హైదరాబాద్‌ మహా నగరంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. నగరం లోని చాదర్‌ఘాట్‌ సమీపంలోని ఉస్మాన్‌పుర ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో ఉంది ఈ ఆస్పత్రి. నిర్వాహకుల అనుమతి తీసుకుని ఒకసారి లోపలికెళ్లి చూస్తే.. ఓ కొత్త వాతావరణం కనిపిస్తుంది. అక్కడ డాక్టర్లు మొదలుకుని సిబ్బంది వరకూ మహిళలే కనిపిస్తారు. ఈ ఆస్పత్రిలో ఆత్మీయ వాతావరణంలో రోగులను సిబ్బంది ఆప్యాయంగా పలకరిస్తారు. 

ఇలా ప్రారంభమైంది.. 
1969లో నగరంలోని ఓ మార్వాడీ మహిళ పురిటి నొప్పులతో నయాపూల్‌ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రసూతీ ఆస్పత్రిలో చేరింది. నొప్పులు పెరగటంతో ఆమెను లేబర్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. డెలివరీ చేయడానికి లేబర్‌ రూమ్‌లో మగ డాక్టర్‌ మాత్రమే ఉన్నారు. దీంతో ఆ మహిళ మగ డాక్టర్‌ వద్ద డెలివరీ చేయించుకోడానికి నిరాకరించింది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా ఆమె మగ డాక్టర్‌ ద్వారా డెలివరీ చేయించుకోనని.. ప్రాణం పోయినా సరే తన లజ్జను మరో వ్యక్తి ముందు తీసుకోనని సమాధానం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే మహిళా వైద్యురాలు లేకపోవడంతో తీవ్ర నొప్పులతో ఆమె మరణించింది. ప్రసూతీ దవాఖానాలో మగ డాక్టర్‌ వద్ద వైద్యాన్ని నిరాకరించి ప్రాణాలు కోల్పోయిన మహిళ అని మరుసటి రోజు వివిధ పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. 

ఆస్పత్రిలో వైద్య సేవలు.. 
ఈ ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలను అనుభవజ్ఞులైన మహిళా డాక్టర్లే చేస్తారు. ప్రసూతీ, మహిళా వ్యాధులు, సంతాన సాఫల్యత చికిత్సలతో పాటు శిశువుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పలు విభాగాలు కొనసాగుతున్నాయి. ల్యాప్రొస్కోపీ లాంటి అధునాతన టెక్నాలజీ సదుపాయం, నవజాత శిశువులకు ఎన్‌ఐసీయూ, పీఐసీయూ ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. 24 గంటలు ఆరుగురు వైద్యులు వైద్య సేవలు అందిస్తారు. అలాగే మహిళలు, శిశువుల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఆస్పత్రిలో డాక్టర్లతో పాటు నర్సులు, వివిధ రకాల పరీక్షలు చేసే సిబ్బంది అంతా మహిళలే. మగవారికి ఆస్పత్రి లోపలికి ప్రవేశం ఉండదు. రోగులను చూడటానికి వచ్చే మగవారిని సాయంత్రం ఒక గంట పాటు అనుమతిస్తారు. మగవారు ఆస్పత్రికి వచ్చే సమయంలో అన్ని వార్డుల్లో పరదాలు కప్పేస్తారు.

మహిళలతో మహిళల కోసం..
అప్పటికే నగరంలో ఖిద్మతే ఖల్క్‌ (ప్రజా సేవ) అనే పేరుతో అబ్దుర్రజాక్‌ అనే వ్యక్తి ఓ సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో చలించిపోయిన ఆయన.. నగరంలోని డాక్టర్లను కలసి జరిగిన ఘటన గురించి వివరించారు. ఆ రోజుల్లో నగరంలో ఒకరో ఇద్దరో మహిళా డాక్టర్లు ఉన్నారు. వీరితోపాటు ఇతర డాక్టర్లతో సమావేశమై.. మగ డాక్టర్‌ వద్ద వైద్యం నిరాకరించి ప్రాణాలు వదిలిన మహిళ మాదిరిగా మరొకరు ప్రాణాలు కోల్పోకూడదని, డాక్టర్లంతా మానవతా దృక్పథంతో ముందుకొచ్చి తమ సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని మహిళా డాక్టర్లు మహిళలకు వైద్యం చేయడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో స్త్రీ, పురుష డాక్టర్లు ఒక కమిటీగా ఏర్పడి ముస్లిం మెటర్నిటీ దవాఖానాను పురానీహవేలీలో ప్రారంభించారు. తొలుత 25 పడకలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి ఇప్పుడు చాదర్‌ఘాట్‌ ఉస్మాన్‌పురలో 350 పడకలతో ‘నో లాస్‌.. నో ప్రాఫిట్‌’పద్ధతిలో కొనసాగుతోంది. ఈ దవాఖానా నినాదం ‘మహిళలకు.. మహిళలతో వైద్యం’ ఇక్కడ చారిటబుల్‌ రేట్లలో కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement