ఎక్కడి చెత్త అక్కడే | Sakshi
Sakshi News home page

ఎక్కడి చెత్త అక్కడే

Published Tue, Jul 7 2015 2:10 AM

Municipal labourers to GHMC negligence

మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభం
-  జీహెచ్‌ఎంసీతో పాటు మున్సిపాలిటీల్లో స్తంభించిన పనులు
-   కార్మిక జేఏసీతో చర్చలు విఫలం
 
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె శంఖాన్ని పూరించారు. వేతనాల పెంపుతో సహా 16 డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న వేల మంది కార్మికులు సోమవారం ఉదయం 6 గంటల నుంచి సమ్మెలోకి దిగారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు స్తంభించిపోయాయి. మరోవైపు కార్మికులతో సమ్మె విరమింపజేయడానికి తొలిరోజు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి సచివాల యంలో కార్మిక ఐక్య సంఘాల నేతలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారానికి చర్చలను వాయిదా వేశారు. వేతనాల పెంపు, ఎక్స్‌గ్రేషియా తదితర డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉండడంతో వీటిపై సీఎం నిర్ణయం తీసుకోవాలని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు.
 
  సీఎం హరితహారంలో భాగంగా జిల్లాల పర్యటనల్లో ఉన్నందున నిర్ణయం తీసుకోడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు సమ్మె వాయిదా వేసుకోవాలని కార్మిక నేతలకు సూచించారు. అయితే సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని చర్చల అనంతరం కార్మిక నేతలు ప్రకటించారు. మంత్రుల ప్రతిపాదనపై క్షేత్రస్థాయిలో కార్మికులతో చర్చించిన తర్వాతే సమ్మె విరమణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం రెండో దఫా చర్చల్లో అవగాహన కుదిరితే సమ్మె వాయిదా వేస్తామని కార్మిక నేతలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement