
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి శక్తి.. తెలంగాణ శక్తిగా మారాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు సీఎం కేసీఆర్ వెంట నిలవాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. దేశం మొత్తంలో విద్యార్థులు, యువకులను ప్రోత్సహించిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. తెలంగాణ భవన్‌లో సోమవారం టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ సుమన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి టీఆర్‌ఎస్‌వీ నాయకులు తీసుకుపోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.