మునగాలకు చెందిన పిట్ట సైదిరెడ్డి, పద్మల కుమారుడు పిట్ట గోపిరెడ్డి. స్థానిక న్యూప్రజ్ఞ పాఠశాలలో పదవ తరగతి
మునగాల : మునగాలకు చెందిన పిట్ట సైదిరెడ్డి, పద్మల కుమారుడు పిట్ట గోపిరెడ్డి. స్థానిక న్యూప్రజ్ఞ పాఠశాలలో పదవ తరగతి చదువుతూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షిక పరీక్షలు రాస్తున్నాడు. ఇదిలా ఉండగా గురువారం గోపిరెడ్డి తల్లి పద్మ మునగాల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. దీంతో పద్మ మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించి గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి తరలించారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా తలకొరివి పెట్టాల్సిన కుమారుడు గోపిరెడ్డి పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు పద్మ మృతదేహాన్ని ఇంటిలోనే ఉంచి కుమారుడుని పరీక్ష రాసేందుకు పంపారు. విషణ్ణ వదనంతో దుఖాన్ని దిగమింగుతూ పరీక్ష పూర్తిచేసిన అనంతరం తల్లికి తలకొరివి పెట్టాడు. ఈ సంఘటనను చూసిన పలువురు కంటతడిపెట్టారు.