బొల్లారం – సికింద్రాబాద్‌

MMTS Line For Bollaram To Secendrabad  - Sakshi

పరుగులు పెట్టనున్న ఎంఎంటీఎస్‌  

పట్టాలెక్కనున్న రైళ్లు  

రెండో దశకు ఊరట 

రూ.50 కోట్లు కేటాయింపు  

సాక్షి, సిటీబ్యూరో: రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటికే విద్యుదీకరణ, రైల్వే భద్రతా కమిటీ తనిఖీలు పూర్తి చేసుకున్న 12.5 కిలోమీటర్ల మల్కాజిగిరి–బొల్లారం ఎంఎంటీఎస్‌ రెండో దశ మార్గంలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇటు సికింద్రాబాద్‌ నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్‌ వరకు, అటు కాచిగూడ నుంచి మల్కాజిగిరి, బొల్లారం మీదుగా మేడ్చల్‌ వరకు ఎంఎంటీఎస్, సబర్బన్‌ రైళ్ల రాకపోకలకు అవకాశం కలగనుంది. 2013లో రూ.810 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశలో మొత్తం 6 లైన్‌లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం బొల్లారం–మల్కాజిగిరి పూర్తయింది. త్వరలో  పటాన్‌చెరు–తెల్లాపూర్, సికింద్రాబాద్‌–ఘట్కేసర్‌ మార్గాలు కూడా పూర్తి కానున్నాయి. రెండో దశకు అయ్యే వ్యయంలో సుమారు రూ.544 కోట్లను రాష్ట్రమే భరించాల్సి ఉండగా... గతంలో రూ.160 కోట్లు, ప్రస్తుతం రూ.50 కోట్లు కేటాయించింది.

ఇంకా రూ.334 కోట్ల వరకు రాష్ట్రం అందజేయాల్సి ఉంది. మిగతా మొత్తాన్ని రైల్వేశాఖ భరిస్తోంది. సింగిల్‌ లైన్‌లను డబ్లింగ్‌ చేయడం, విద్యుదీకరించడం, అవసరమైన చోట కొత్తలైన్‌లు వేయడం వంటి నిర్మాణ పనులను ఈ ప్రాజెక్టు కింద చేపట్టారు. కొత్తగా ఎంఎంటీఎస్‌ రైళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. అలాగే అల్వాల్, సుచిత్ర, భూదేవీనగర్‌ తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్‌లు కూడా నిర్మించాల్సి ఉంది. ఆరేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును చేపట్టినప్పటికీ నిధుల కొరత, భూ సేకరణలో సమస్యలతో తీవ్ర జాప్యం జరిగింది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్‌ వరకు రైల్వే మార్గాన్ని డబ్లింగ్‌ చేసి విద్యుదీకరించాల్సి ఉంది. ఉందానగర్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్‌ల కొత్త లైన్‌లు నిర్మించి, అక్కడ రైల్వే స్టేషన్‌ కట్టాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ జీఎమ్మార్‌ నిరాకరించడంతో అది వాయిదా పడింది. మిగతా సెక్టార్‌లలో పనులు కొనసాగుతున్నాయి. 2019 చివరి నాటికి దశలవారీగా ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top