పక్కా ప్రణాళికతో..


     ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం

     వెయ్యికిపైగా ఓట్లున్న కేంద్రాల్లో రెండో పోలింగ్ బూత్

     కొత్త ఓటర్ల పరిశీలన తర్వాత 26న తుది ఎలక్ట్రోరల్ జాబితా

     వచ్చే నెల 16న ఉదయం 8 నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్

     శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు

     స్వచ్ఛందంగా పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలి

     ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి వెల్లడి


 

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే నెల 16న జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానం ఎన్నికల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి చెప్పారు. ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మిగిలిన రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు పోలీసు సిబ్బందితో కలిసి ముందుకెళుతున్నామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన విధంగా, ఎన్నికల నిబంధనల మేరకు ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికలలో మూడు జిల్లాల్లోని 2,62,582 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందుకోసం 278 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

 

 అయితే, ఆన్‌లైన్‌లో కొత్తగా మరో 24,431 మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీటిని పరిశీలించి ఈనెల 26న ఓటరు తుదిజాబితా ప్రచురిస్తామని చెప్పారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఎంపిక కూడా పూర్తయిందని, పోలింగ్,, కౌంటింగ్‌కు అవసరమైన సిబ్బందిని కూడా నియమించి వారికి శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. బ్యాలెట్ బాక్సులను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో 1000 మందికి పైగా ఓటర్లు 122 కేంద్రాల్లో ఉన్నారని, ఈ కేంద్రాల్లో అదనపు పోలింగ్‌బూత్  ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 

 పోలింగ్ సమయంలో ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఒకరు లేదా ఎంతమంది అభ్యర్థులకయినా ఓటు వేయవచ్చని, అయితే, ఒకరికి ఇచ్చిన ప్రాధాన్యతను మరో అభ్యర్థికి ఇవ్వకూడదని చెప్పారు. బ్యాలెట్ పేపర్‌పై 1, 2, 3 అంకెల రూపంలో అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప టిక్‌పెట్టడం, తప్పు గుర్తు పెట్టడం, ఇతర అంశాలను రాయడం లాంటివి చేయవద్దని, అలా చేస్తే ఓటు చెల్లదని ఆయన వెల్లడించారు. మొత్తంమీద ఎన్నిక నిర్వహణ కోసం అవసరమైన బందోబస్తు ప్రణాళిక కూడా రూపొందించుకున్నామని, ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ రాధాకిషన్‌రావు, డీఆర్వో రవినాయక్‌లు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top