breaking news
Khammam and Warangal districts
-
జోరుగా వానలు
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పొంగిన వాగులు ఖమ్మం జిల్లా దమ్మపేటలో 15 సెం.మీ.ల అత్యధిక వర్షపాతం నమోదు భద్రాచలం ఏజెన్సీలో నీటమునిగిన 40 గిరిజన గ్రామాలు మరో 2 రోజుల్లో తెలంగాణ, ఏపీలకు భారీ వర్ష సూచన సాక్షి, నెట్వర్క్: వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారడం దానికి నైరుతి రుతుపవనాల ప్రభావం తోడవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాలను వర్షాలు ముంచెత్తగా... ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షపాతం ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం సగటున 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దమ్మపేటలో 15 సెం.మీ వర్షం కురిసింది. భద్రాచలంలో 24 వ్యవధిలో 17.6 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలో సుమారు 40 గిరిజన గ్రామాలు నీటమునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రానికి 25 అడుగులకు చేరింది. బూర్గంపాడు మండలంలో సుమారు 20 చెరువులకు గండ్లు పడ్డారుు. వరంగల్ జిల్లావ్యాప్తంగా సగటున 10.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, ములుగు, తాడ్వాయి మండలాల్లోని వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారుు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లా సగటున 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్, కాటారం మండలాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగాయి. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 38 మండలాల్లో వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం 8 గంటల వ రకు జిల్లావ్యాప్తంగా సగటు వర్షపాతం 3.7 మి.మీలుగా న మోదైంది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సగటున 10.4 మి.మీ వర్షపాతం నమోదైంది. బొగ్గు ఉత్పత్తికి వర్షం బ్రేక్: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ల్లో భారీగా వరదనీరు చేరడంతో సుమారు 60 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని గౌతంఖని ఓపెన్‌కాస్టు వద్ద 9.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి జేవీఆర్ ఓసీపీ వద్ద 8.6 సెం.మీ, కోయగూడెం ఓపెన్‌కాస్టు వద్ద 3.9 సెం.మీ, ఇల్లెందు జేకే-5 ఓసీపీ వద్ద ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఓపెన్‌కాస్టుల వద్ద 2.6 సెం.మీ, కరీంనగర్ జిల్లా రామగుండం ఓసీపీ-1 వద్ద 3 సెం.మీ, రామగుండం ఓసీపీ-2 వద్ద 2.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. 288 మండలాల్లో అధిక వర్షపాతం రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన ఈ నెల ఒకటి నుంచి 20 వరకు సాధారణం కంటే 96 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో మంచి వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలోనైతే 264 శాతం అధికంగా నమోదైంది. రాష్ట్రంలో 459 మండలాలకుగాను 288 మండలాల్లో అధిక వర్షం కురిసింది. 96 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 61 మండలాల్లో వర్షపాతం లోటు ఉండగా, 14 మండలాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో అధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని 8 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వరద బాధితులకు 24 గంటల్లోనే పరిహారం: హరీశ్ వర్షాలకు నష్టపోయిన బాధితులకు 24 గంటల్లోనే పరిహారాన్ని అందిస్తున్నామని, ఏ ప్రభుత్వం చేయని తరహాలో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇది ఒక రికార్డు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం, పట్టణంలో కురిసిన వర్షానికి నష్టపోయిన బాధితులకు శనివారం రాత్రి సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో రూ. 3,200 చొప్పున రూ. 48 వేల పంపిణీ చేశారు. తెలంగాణ, ఏపీలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారింది. రాత్రికి ఒడిశాలోని పూరీకి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా పయనించి గోపాల్పూర్-పూరీల మధ్య ఆదివారం ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. -
పక్కా ప్రణాళికతో..
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం వెయ్యికిపైగా ఓట్లున్న కేంద్రాల్లో రెండో పోలింగ్ బూత్ కొత్త ఓటర్ల పరిశీలన తర్వాత 26న తుది ఎలక్ట్రోరల్ జాబితా వచ్చే నెల 16న ఉదయం 8 నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్ శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు స్వచ్ఛందంగా పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి వెల్లడి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే నెల 16న జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానం ఎన్నికల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి చెప్పారు. ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మిగిలిన రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు పోలీసు సిబ్బందితో కలిసి ముందుకెళుతున్నామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన విధంగా, ఎన్నికల నిబంధనల మేరకు ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికలలో మూడు జిల్లాల్లోని 2,62,582 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందుకోసం 278 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అయితే, ఆన్లైన్లో కొత్తగా మరో 24,431 మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీటిని పరిశీలించి ఈనెల 26న ఓటరు తుదిజాబితా ప్రచురిస్తామని చెప్పారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఎంపిక కూడా పూర్తయిందని, పోలింగ్,, కౌంటింగ్‌కు అవసరమైన సిబ్బందిని కూడా నియమించి వారికి శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. బ్యాలెట్ బాక్సులను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో 1000 మందికి పైగా ఓటర్లు 122 కేంద్రాల్లో ఉన్నారని, ఈ కేంద్రాల్లో అదనపు పోలింగ్‌బూత్ ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఒకరు లేదా ఎంతమంది అభ్యర్థులకయినా ఓటు వేయవచ్చని, అయితే, ఒకరికి ఇచ్చిన ప్రాధాన్యతను మరో అభ్యర్థికి ఇవ్వకూడదని చెప్పారు. బ్యాలెట్ పేపర్‌పై 1, 2, 3 అంకెల రూపంలో అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప టిక్‌పెట్టడం, తప్పు గుర్తు పెట్టడం, ఇతర అంశాలను రాయడం లాంటివి చేయవద్దని, అలా చేస్తే ఓటు చెల్లదని ఆయన వెల్లడించారు. మొత్తంమీద ఎన్నిక నిర్వహణ కోసం అవసరమైన బందోబస్తు ప్రణాళిక కూడా రూపొందించుకున్నామని, ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ రాధాకిషన్‌రావు, డీఆర్వో రవినాయక్‌లు పాల్గొన్నారు.