మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రెండో విడత చెరువుల పనులకు అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది.
331 చెరువులకు రూ.112.79 కోట్లు కేటాయిస్తూ తొలి ఉత్తర్వు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రెండో విడత చెరువుల పనులకు అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం నాలుగు జిల్లాల పరిధిలోని 331 చెరువుల పనులకు రూ. 112.79 కోట్లకు పరిపాలనా అనుమతులిస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం నుంచి కూడా వరుసగా ‘మిషన్’ పనులకు అనుమతులు ఇస్తారని, వారంలోగా మూడు వేల చెరువులకు అనుమతులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చిన్న నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. మొదటి విడతలో మిగిలిన769 చెరువులతో కలిపి ఈ ఏడాది మొత్తంగా 10,355 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుంది. వీటి కోసం రూ. 2,083 కోట్లు ఖర్చు చేయనున్నారు.
లక్ష్యాలను చేరుకునేందుకు ఏయే ప్రక్రియను ఎప్పట్లోగా పూర్తి చేయాలన్నది ఇప్పటికే నిర్ణయించారు. రెండో విడతలో జనవరి నెలాఖరు నాటికి 40 శాతం పనులు ప్రారంభించాలనే లక్ష్యానికి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.