నగరం నలుమూలలా ఐటీ కంపెనీలు

Minister KTR Says IT Companies Will Expand Outside Hyderabad By Grid Expansion - Sakshi

ఐటీ రంగాన్ని విస్తరించేందుకు త్వరలో గ్రిడ్‌ విధానం: కేటీఆర్‌

తూర్పు హైదరాబాద్‌కు వెళ్లే కంపెనీలకు ప్రోత్సాహకాలు

కొత్తగా ఉప్పల్‌ కారిడార్‌లో 25 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్

ఈస్ట్‌ హైదరాబాద్‌లో 30 వేల ఉద్యోగాలు!

సాక్షి, హైదరాబాద్‌ : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని హైదరాబాద్‌లోని అన్ని మూలలకూ విస్తరించేందుకు త్వరలో గ్రిడ్‌ విధానాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. హైదరాబాద్‌కు తూర్పున ఉప్పల్‌ వైపు ప్రస్తుతమున్న ఐటీ కంపెనీలకు తోడు మరిన్ని ఐటీ, అనుబంధ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌ గ్రోత్‌ ఇన్‌ డిస్పెర్షన్‌ (గ్రిడ్‌) కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌ బుధవారం ఉప్పల్‌ ఎన్‌ఎస్‌ఎల్‌ ఎరెనాలో ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈస్ట్‌ హైదరాబాద్‌లో ఐటీ రంగం స్థితిగతులు, భవిష్యత్తు పెట్టుబడులపై మంత్రి ఈ సమావేశంలో చర్చించారు.

గ్రిడ్‌ ద్వారా ఐటీ రంగం విస్తరణ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే గ్రిడ్‌ వి«ధానం ద్వారా ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు తరలివస్తాయనే ఆశాభావాన్ని కేటీఆర్‌ వ్యక్తం చేశారు. ఈస్ట్‌ హైదరాబాద్‌లో  ఇప్పటికే మెట్రో, శిల్పారామం, మూసీ నది అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతులు మెరుగవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వైపు, అంబర్‌ పేట్‌ రామాంతాపూర్‌ ఫ్లై ఓవర్ల ద్వారా రోడ్లు, మౌలిక వసతులు మరింత మెరుగవుతాయన్నారు. హైదరాబాద్‌ నలువైపులా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మెడికల్‌ డివైజెస్‌ వంటి పరిశ్రమలు విస్తరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఔటర్‌ రింగు రోడ్డు వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలు తరలివెళ్తే, వాటి స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతినిచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. 

ఐదు కంపెనీలకు కన్వర్షన్‌ పత్రాలు
పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్‌ పత్రాలను ఐదు ఐటీ కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్‌ బుధవారం అందజేశారు. ఐదు కంపెనీల ద్వారా సుమారు 25 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా ఉప్పల్‌ ప్రాంతంలో మరో 30వేల మంది ఐటీ ఉద్యోగులకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాచకొండ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ రూపొందించిన సమాచార సంచికను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, రాచకొండ కమీషనర్‌ మహేశ్‌ భగవత్, వివిధ ప్రభుత్వ శాఖల అ«ధికారులతో పాటు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top