మిగులు నిధులు క్యారీఫార్వర్డ్‌ చేశాం | Minister Koppula Eshwar About SCs Development In Assembly | Sakshi
Sakshi News home page

మిగులు నిధులు క్యారీఫార్వర్డ్‌ చేశాం

Sep 17 2019 2:32 AM | Updated on Sep 17 2019 3:40 AM

Minister Koppula Eshwar About SCs Development In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సోమవారం పద్దులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కేటాయించిన మొత్తాన్ని ఖర్చు చేయకుంటే వాటిని క్యారీఫార్వర్డ్‌ చేయాలని చట్టంలో పొందుపర్చామన్నారు. అందులో భాగంగా తాజా బడ్జెట్‌లో రూ.419.94 కోట్లు క్యారీఫార్వర్డ్‌ చేసినట్లు చెప్పారు. 2017–18 సంవత్సరానికి సంబంధించి రూ.134 కోట్లు, 2018–19 సంవత్సరానికి సంబంధించి రూ.285.94 కోట్లు మిగిలిపోయాయని, వీటిని తాజా బడ్జెట్‌లో క్యారీఫార్వర్డ్‌ చేసినట్లు చెప్పారు.

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బడ్జెట్‌ కేటాయింపులు తగ్గినప్పటికీ ఎస్సీ అభివృద్ధి శాఖకు మాత్రం అదనంగా రూ.350 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం ప్రకారం 15.45 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 16.48 శాతం నిధులు కేటాయించిందని వెల్లడించారు. రియల్‌బూమ్‌ నేపథ్యంలో భూముల ధరలు పెరిగిపోయినందున భూపంపిణీ కోసం భూమిని కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. ఈ పరిమితిని పెంచాలని సభ్యులు కోరినందున ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రతి జిల్లాకో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేశామని, వీటికి పూర్తిస్థాయి భవనాలను నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.

వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు  కమిటీ 
రాష్ట్రంలో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి చెప్పారు. దాదాపు 70వేల ఎకరాల భూములు వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్నాయని, వీటి పరిరక్షణకు ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏజెన్సీలో పోలీసు, రెవెన్యూ, స్థానిక అధికారులను నియమించనున్నట్లు వివరించారు. ఈ కమిటీతో నిరంతర పర్యవేక్షణ చేయిస్తామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement