కాలేజీ విద్యార్థులకూ ‘భోజనం’

Mid-day Meals scheme likely for college students in TS - Sakshi

ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అమలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ కాలేజీల్లో చదువు కుంటున్న విద్యార్థులకు శుభవార్త. ఇంటి దగ్గర్నుంచి ఆదరాబాదరాగా లంచ్‌బాక్స్‌ తీసుకెళ్లాల్సిన పనికి స్వస్తి పలకండి. ఇకపై కాలేజీలోనే వేడివేడి భోజనాన్ని మధ్యాహ్నం భుజించొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జూనియర్‌ కాలేజీల్లో పథకం అమలుపై ఇదివరకే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మధ్యాహ్న భోజనంపై నిర్ణయం తీసుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ మంత్రివర్గ ఉప సంఘానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ స్కూల్‌లోని ఇంటర్‌ విద్యార్థులు.. డీఈడీ, బీఈడీ, పాలిటెక్నిక్‌ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై నిర్ణయం తీసుకుంది.

అక్షయపాత్రకు బాధ్యతలు...
ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంపై కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్, మోడల్‌ స్కూల్‌లోని ఇంటర్మీడియట్‌ విద్యార్థులు.. డీఈడీ, బీఈడీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో విద్యార్థులు కలిపి దాదాపు 5 లక్షల మంది ఉంటారని విద్యాశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో అంతమంది విద్యార్థులకు ఏకకాలంలో భోజనం అందించడం సవాలే. ఈ నేపథ్యంలో పథకం అమలు బాధ్యతలను అక్షయపాత్రకు ఇవ్వాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

క్షేత్రస్థాయిలో పథకం అమలు కోసం వంట గదులు, సామగ్రిని సమాకూర్చుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అక్షయ పాత్ర సంస్థ ప్రతినిధులకు మంత్రులు స్పష్టం చేశారు. పథక అమలులో 3 రకాల ప్రతిపాదన లు మంత్రులు సూచించారు. 5 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కావాల్సిన సరుకులన్నీ ప్రభుత్వమే సరఫరా చేయడం... అక్షయపాత్ర సంస్థ స్వయం సమకూర్చుకోవడం.. అలాగే నిర్దేశించిన విద్యార్థులకు పులిహోరా, బ్లాక్‌ రైస్, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జల వంటి విభిన్న తృణ ధాన్యాలతో కూడిన భోజనాన్ని అందించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది.

అక్షయ పాత్ర సంస్థ ఏర్పాటు చేసిన వంటశాలలే కాకుండా కాలేజీలకు సమీపంలోని మెస్‌లు, హోటళ్ల సేవలు కూడా వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిం చాలని మంత్రులు వివరించారు. ఆగస్టు రెండోవారంలోపు కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తే.. మూడో వారంలో మరోమారు మంత్రివర్గ బృందం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్, మాధ్యమిక శిక్షా అభియాన్‌ సంయుక్త సంచాలకులు జి.రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top