మహిళల అభివృద్ధికి మైక్రో క్రెడిట్‌ ప్లాన్‌

Micro Credit Plan Will Be Implemented For Women's Development In Telangana - Sakshi

ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు

సాక్షి, సంగారెడ్డి: మహిళల అభివృద్ధి కోసం ‘మైక్రో క్రెడిట్‌ ప్లాన్‌’అమలు చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో శనివారం ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే దే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమని చెప్పారు. మహిళలకు రుణాలివ్వడానికి మైక్రో క్రెడిట్‌ ప్లాన్‌ ను అమలు చేస్తామని తెలిపారు. వ్యాపారాలు చేసుకోవడానికి ఈ ప్లాన్‌ ద్వారా విరివిగా రుణాలివ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా, కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు.

గతంలో వీరికిచ్చే ప్రోత్సాహకం రూ.50 వేలు ఉండగా, ప్రస్తుతం దానిని రూ.లక్షకు పెంచామని తెలిపారు. వీరికి కల్యాణలక్ష్మి సైతం వర్తిస్తుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీలు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళితే వారికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం 35 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 500 పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజుశ్రీ, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top