మేడారం కుంభమేళా: నిలువెత్తు దోపిడి

Merchants collecting High Prices From Medaram jatara Devotees - Sakshi

భక్తుల మొక్కు.. వ్యాపారులకు లక్కు

కిలో బెల్లం ధర రూ.60 నుంచి రూ.80

నాందేడ్‌లో రూ.33 – రూ.35 మాత్రమే

గిరిజనుల పేరిట పాలమూరు కాంట్రాక్టర్‌కు ధారాదత్తం

సాక్షి, వరంగల్‌ : సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లాలనుకునే భక్తులు ముందుగానే నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిలువెత్తు బంగారం(బెల్లం) అమ్మలకు సమర్పించే భక్తులకు వ్యాపారులు చుక్కలు చూపెడుతున్నారు. అడ్డదారిలో 14 దుకాణాలను దక్కించుకున్న పాలమూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతుండటం భక్తులకు శాపంగా మారుతోంది. జాతర సమీపిస్తున్న కొద్దీ ధరలు పెంచుతున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కిలో బెల్లం రూ.43కు విక్రయించగా.. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80కు అమ్ముతున్నారు. అమ్మవార్ల గద్దెల సమీపంలో మరో రూ.10 అదనంగానే తీసుకుంటున్నారని భక్తులు వాపోతున్నారు. 

లారీకి రూ.5లక్షలకు పైగానే లాభం
నాందేడ్‌ తదితర ప్రాంతాల్లో 17 టన్నుల లారీలో కిలోకు రూ.33 చొప్పున రూ.5,61,000 పెట్టుబడితో తెప్పించే వ్యాపారులు... కిలోకు రూ.10 పెంచి అమ్మినా రూ.7,31,000 వస్తాయి. అంటే ఒక్క 17 టన్నుల లారీపై రూ.1.70లక్షలు లాభం వస్తుంది. కానీ కిలోకు రూ.27 నుంచి, రూ.47 వరకు అమ్ముతుండడంతో ఒక్కో లారీపై రూ.4,59,000 నుంచి రూ.7,99,000 వరకు లాభం పొందుతున్నారు. ఒక్క మేడారం జాతర సీజన్‌లో 200 లారీల (17 టన్నుల) బెల్లం విక్రయించే అవకాశం ఉండగా... ఈ బెల్లం రూ.60 కిలో చొప్పున అమ్మితే రూ.9.18 కోట్లు, రూ.80కి విక్రయిస్తే రూ.15.98 కోట్లు భక్తుల సొమ్ము అదనంగా వ్యాపారుల జేబుల్లోకి వెళ్లనుంది. కాగా బెల్లం కొనుగోలు చేసే భక్తులకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ‘అనామతు’గా రాసిస్తున్నారు. అమ్మవార్ల జాతరలోనే బంగారం కొనుగోలు చేయాలని దూరప్రాంతాల నుంచి మేడారం వస్తున్న తాము వ్యాపారుల తీరుతో నిలువుదోపిడీకి గురికావాల్సి వస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఒచ్కో చోట ఒకలా...
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, పరకాల తదితర ప్రాంతాలకు సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా లారీల కొద్దీ బెల్లం దిగుమతి అవుతోంది. ఈ మేరకు వ్యాపారులు ధరలను కొండెక్కిస్తున్నా రు. ప్రధానంగా వరంగల్‌ పాత బీటుబజార్‌కు చెందిన 9 మంది వ్యాపారులు ‘సిండికేట్‌’గా ఏర్పడి అధిక ధరలకు విక్రయిస్తూ రూ.లక్షల గడిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ 9 మంది వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. నాందేడ్, పూణే, ఛత్తీస్‌గఢ్, సోలాపూర్, అకోలా(మహారాష్ట్ర) తదితర ప్రాంతాల నుంచి సదరు వ్యాపారులు రోజుకు 20 లారీల వరకు బెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. శనివా రం నుంచి ఈ వ్యాపారం మరింత పుంజుకునే అవకాశం ఉండగా.. ఫిబ్రవరి 8 వరకు సుమా రు 150 లారీల బెల్లం విక్రయించే అవకాశం ఉంది. ధరల నియంత్రణలో సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యం.. మేడారం వెళ్లకుండానే భక్తులు నిలువు దోపిడీకి కారణమవుతోంది.

మేడారంలో పాలమూరు కాంట్రాక్టర్‌
గిరిజన సంక్షేమశాఖకు చెందిన ఓ కీలక అధికారి అండదండలతో పాలమూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ మేడారంలో 14 దుకాణాలను తెరిచి ధరలు పెంచి బెల్లం విక్రయాలు చేస్తున్నారు. ఇదేమిటని భక్తులు ప్రశ్నిస్తే ‘ఇష్టముంటే తీసుకో, లేకుంటే వెళ్లిపో.. రేటు మాత్రం తగ్గించేది లేదు’ అంటూ దబాయిస్తున్నారు. గిరిజన సంక్షేమం, దేవాదాయశాఖల అధికారులను అడిగితే ‘అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలు సీజ్‌ చేస్తాం’ అని చెబుతున్నారే తప్ప ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా వరంగల్‌ పాత బీటుబజార్‌లో ఆ తొమ్మిది బెల్లం వర్తకుల హవా కొనసాగుతోంది. ప్రతీ శనివారం, ఆదివారం మేడారం వెళ్లే భక్తులు పాత బీటు బజార్‌కు వస్తే కిలో రూ.50 నుంచి 60 వరకు అమ్ముతున్నారు. ఎవరైనా వ్యాపారులు రూ.38, రూ.40కు అమ్మితే.. సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి దాడులు చేయిస్తున్నారని వాపోతున్నారు. కాగా ‘అధిక ధరలకు విక్రయిస్తే వచ్చే లాభం ఒక్క మాకే కాదు.. ఈ వ్యాపారంపై అజమాయిషీ చేసే మూడు శాఖల అధికారులకు వాటా ఇస్తున్నాం.. ఎవరేం ఫిర్యాదు చేసినా మాకేం కాదు’’ అంటూ వ్యాపారులు దబాయిస్తుండడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top