ఈస్ట్‌ లుక్‌కు ‘మైస్‌’ టచ్‌!

Meetings And Conference Exhibition Center In Uppal Hyderabad - Sakshi

ఉప్పల్‌లో మీటింగ్స్‌ అండ్‌ కాన్ఫరెన్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌

రూ.50 కోట్ల వ్యయంతో 16 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో తూర్పువైపునా అభివృద్ధి పరుగులు పెట్టాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చిన ‘ఈస్ట్‌ లుక్‌’కు మరింత ఆకర్షణీయమైన హంగులు సమకూరబోతున్నాయి. ఉప్పల్‌లో అతిపెద్ద మీటింగ్స్‌ అండ్‌ కాన్ఫరెన్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ ఏర్పాటు కాబోతోంది. ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించేలా మీటింగ్స్‌.. ఇన్సెంటివ్స్‌.. కాన్ఫరెన్సింగ్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ (మైస్‌) గా దీన్ని తీర్చిదిద్దనున్నారు.

ఢిల్లీ మైస్‌కు ధీటుగా ఇప్పటికే హైటెక్స్‌లో ఉన్న లెవల్‌–1 స్థాయి మైస్‌ను మించి ఉప్పల్‌ భగాయత్‌లో 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో హైటెక్‌ మైస్‌ను నిర్మించాలని హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. గతంలో ఇజ్జత్‌నగర్‌లో 16 ఎకరాల విస్తీర్ణంలో మైస్‌ను నిర్మించాలని నిర్ణయించారు. నగరం నలువైపులా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, ఉప్పల్‌లో దీనిని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో దీనిని నిర్మించనున్నారు. దీనికనుగుణంగా సాధ్యమైనంత త్వరగా క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని భావిస్తున్నారు.

మైస్‌లో సౌకర్యాలిలా.. 
మైస్‌ను సువిశాల విస్తీర్ణంలో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా సకల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దనున్నారు. కన్వెన్షన్‌లో మీటింగ్‌ రూమ్‌లు, బాల్‌ రూమ్‌లు ఉండనున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌లు నిర్వహించుకునేలా వసతులు కల్పించడంతో పాటు ఏకకాలంలో 400 కార్లు పార్కింగ్‌ చేసేలా మైస్‌ను నిర్మించనున్నారు. రిటైల్, ఎఫ్‌ అండ్‌ బీ వసతులు, హోటల్, సర్వీస్‌డ్‌ అపార్ట్‌మెంట్లు, డార్మిటరీలు, ఎంటర్‌టైన్‌మెంట్, బిజినెస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.

వడివడిగా ఈస్ట్‌లుక్‌.. 
‘ఈస్ట్‌ లుక్‌’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇప్పటికే ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు మినీ శిల్పరామాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోంది. దీంతోపాటు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కొర్రెము ల, ప్రతాపసింగారం గ్రామాల్లో వందల ఎకరాల్లో లే అవుట్‌ చేసి ప్రణాళికబద్ధ అభివృద్ధికి అడుగులు పడేలా చూస్తోంది. ఇప్పుడు మైస్‌ రాకతో ఈస్ట్‌లుక్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని హెచ్‌ ఎండీఏ అధికారులు అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top