రెండు నామినేషన్ల తిరస్కరణ.. 18 ఓకే

Medak  District Nominations Approved And Rejected List For AP Elections 2019 - Sakshi

ఉపసంహరణకు గడువు 28

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల చిత్ర

మెదక్‌ రూరల్‌: మెదక్‌ కలెక్టరేట్‌లో మంగళవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎన్నికల పర్యవేక్షకుడు సంజయ్‌ మీనాలు నామినేషన్లను పరిశీలించారు. ఈ స్క్రూటినీలో సరైన పత్రాలు లేని ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. ఇందులో గౌరిగారి ఆగమయ్య(భారతీయ అనరక్షిత్‌ పార్టీ), సత్యనారాయణరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి)ల నామినేషన్లకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో  ఆ రెండింటినీ తిరస్కరించామన్నారు. దీంతో మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గం బరిలో ప్రస్తుతం 18 మంది ఉన్నట్లు తెలిపారు.

నామినేషన్లను ఉపసంహరించుకోవాలనుకునే వారు ఈ నెల 28న మధ్యాహ్నం 3గంటల లోపు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకోవాలన్నారు. అభ్యర్థి స్వయంగా వచ్చి తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చని చెప్పారు. ఒకవేళ రాలేకపోతే ఏజెంట్‌గాని లేదా ప్రతిపాదించిన వ్యక్తులు కానీ అభ్యర్థి అంగీకార పత్రాన్ని తీసుకొని రావాలని సూచించారు. 28వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తామని చెప్పారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ భవనాలు, ఆస్తులకు సంబంధించిన వాటిని తమ ప్రచారానికి వినియోగించడం నేరమని తెలిపారు. ఇలా చేసే వారిపై క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల అనుమతి తీసుకోనిదే వారి ఆస్తులను ఉపయోగించకూడదన్నారు.

ప్రస్తుతం పరీక్షల నడుస్తున్నందున ప్రతీ అభ్యర్థి పాఠశాలలు, కళాశాలలు వంటి ప్రదేశాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రచారం చేసుకోవచ్చన్నారు. కుల ప్రతిపాదికన ఓట్లు అడగడంతోపాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం నేరమన్నారు. ప్రచార వాహనాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, డీసీఓ వెంకట్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ రత్నాకర్, సూపరింటెండెంట్లు నజీమ్, నారాయణతోపాటు ఇతర అధికారులు ఉన్నారు.

ప్రస్తుతం మెదక్‌ లోక్‌సభ బరిలో నిలిచిన అభ్యర్థులు
గాలి అనిల్‌కుమార్‌(కాంగ్రెస్‌), మామిళ్ల ఆంజనేయులు(కాంగ్రెస్‌ రెబల్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), మాధవనేని రఘునందన్‌రావు(బీజేపీ), గుండుకాడి కరుణాకర్‌(ఇండియా ప్రజాబంధు పార్టీ), పోసానపల్లి మైపాల్‌రెడ్డి(ఎస్‌ఎఫ్‌బీపీ), కేడీ భరతేష్‌(సోషలిస్టు యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా), మాధవరెడ్డిగారి హనుమంతురెడ్డి(శివసేన), మెరిగె సంతోష్‌రెడ్డి(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), వరికోలు శ్రీనివాస్‌(సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) కల్లు నర్సింహాగౌడ్‌(స్వతంత్ర అభ్యర్థి), కొల్కూరి ప్రతాప్‌(స్వతంత్ర అభ్యర్థి), గజబీంకర్‌ బన్సీలాల్‌(స్వతంత్ర అభ్యర్థి), గొండి భుజంగం(స్వతంత్ర అభ్యర్థి), తుమ్మలపల్లి పృథ్వీరాజ్‌(స్వతంత్ర అభ్యర్థి), దొడ్ల వెంకటేశ్‌(స్వతంత్ర అభ్యర్థి), ప్రదీప్‌కుమార్‌(స్వతంత్ర అభ్యర్థి), బంగారు కృష్ణ(స్వతంత్ర అభ్యర్థి).

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top