విదేశీ ఎంబీబీఎస్‌కు స్వదేశంలో షాక్‌!

MBBS Students From Abroad Not Qualifying FMGE Exam In India - Sakshi

ఎఫ్‌ఎంజీఈలో 85 శాతం మంది వైద్య విద్యార్థులు ఫెయిల్‌

61,500 మందిలో 8,700 మందికే అర్హత

సాక్షి, హైదరాబాద్‌: విదేశీ వైద్య విద్య స్వదేశంలో నిలబడ లేకపోతోంది. వివిధ దేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన చాలా మంది భారతీయులు ఇక్కడ లైసెన్స్‌ పొందడంలో విఫలమవుతున్నారు. విదేశీ ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉన్న దాదాపు 85 శాతం మంది విద్యార్థులు దేశంలో ప్రాక్టీస్‌ చేయడానికి లైసెన్స్‌ ఇచ్చే పరీక్షను క్లియర్‌ చేయడంలో విఫలమయ్యారని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక తెలిపింది. 2015 నుంచి 2018 మధ్య నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించిన ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) కోసం సుమారు 61,500 మంది విదేశీ ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు హాజరయ్యారు.

వీరిలో కేవలం 8,700 మంది మాత్రమే అర్హత సాధించగలిగారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. వీరిలో ఎక్కువ మంది స్వదేశంలో సీటు పొందడంలో విఫలమైన తరువాత ఎంబీబీఎస్‌ చదవడానికి విదేశాలకు వెళ్లిన విద్యార్థులేనని నివేదిక పేర్కొంది. అమెరికా బ్రిటన్‌ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ మినహా ఇతర దేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు దేశంలో ప్రాక్టీస్‌ చేయడానికి, ఏదైనా ఆసుపత్రిలో పని చేయడానికి ఎఫ్‌ఎంజీఈ పరీక్ష పాస్‌ అవ్వాలనేది నిబంధన.

గత ఆరేళ్లలో ఎఫ్‌ఎంజీఈని క్లియర్‌ చేసిన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 2012–13లో 28.29 నుంచి 2016–17లో 9.44 కనిష్టానికి చేరుకుందని ఆ నివేదిక పేర్కొంది. వాస్తవానికి అఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, జర్మనీ, హైతీ, హంగరీ, థాయ్‌లాండ్, జాంబియా తదితర దేశాల్లో చదివిన ఏ ఒక్క ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్‌ కూడా ఈ పరీక్షను క్లియర్‌ చేయలేకపోయారని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో మెడికల్‌ కాలేజీలలో తక్కువ సంఖ్యలో సీట్లు అందు బాటులో ఉన్నందున పెద్ద ఎత్తున భారతీయ విద్యార్థులు ఏటా విదేశాలకు మెడిసిన్‌ చదువు కోసం వెళ్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top