మార్కెట్‌ మాయ...

Marketing Branches May Combined? - Sakshi

ఉమ్మడి జిల్లాల్లో మార్కెటింగ్‌ శాఖల విలీనం

రెండేళ్లకే జీఓ మార్చిన ప్రభుత్వం

యూటర్న్‌ తీసుకోనున్న సర్కారు 

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాల పునర్విభజన సమయంలో ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖను సైతం విభజించింది. ప్రతి జిల్లాకు ఒక మార్కెటింగ్‌ శాఖ మేనేజర్‌ను నియమిస్తూ జీఓ జారీ చేసింది. అయితే రెండేళ్లకే తిరిగి ‘యూటర్న్‌’ తీసుకుంది. తాజాగా జీఓ నం.746ను విడుదల చేసింది. దీని ప్రకారం మార్కెటింగ్‌ జిల్లా స్థాయి కార్యాలయాలను మళ్లీ విలీనం చేయనుంది.   జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లా మార్కెటింగ్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటికి మేనేజర్లను కూడా నియమించారు. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విడిపోవడంతో కొత్తగూడెం మార్కెట్‌ యార్డు ఆవరణలో జిల్లా మార్కెటింగ్‌ కార్యాలయం ఏర్పాటైంది. అయితే అందులో డీఎంఓతోపాటు మరొక అధికారి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

సిబ్బంది కొరతతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌  శాఖాధికారులు ఈ విషయాన్ని అధ్యయనం చేసి, తిరిగి యూటర్న్‌ తీసుకుని పాత పద్ధతిలోనే  హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా మార్కెటింగ్‌ కార్యాలయాలను మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అగ్రికల్చర్‌ అండ్‌ కో–ఆపరేషన్‌ మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఇప్పటికే జీఓ కూడా విడుదలైంది. అయితే ప్రస్తుతానికి మాత్రంకొత్తగూడెం జిల్లా కేంద్ర కార్యాలయం నుంచే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.  ఎన్నికల నేపథ్యంలో జీఓ మినహా మరెలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా మార్కెటింగ్‌ మేనేజర్‌ జె.నరేందర్‌ నేతృత్వంలోనే నడుస్తున్నాయి.

ఉమ్మడి జిల్లా కేంద్రాలలో డీడీ స్థాయి అధికారిని, విభజన జిల్లాల్లో ఏడీ స్థాయి అధికారులను గతంలో వలె నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం ఉమ్మడి జిల్లా అయిన ఖమ్మంలో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్‌ కార్యాలయం విలీనమై ఖమ్మం కేంద్రంగానే రెండు జిల్లాల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అయితే కొత్తగూడెం మార్కెట్‌ యార్డు సెక్రటరీనే విభజన జిల్లాల నిర్వహణను చూస్తారు. దీని ప్రకారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మార్కెట్‌ యార్డులో ఉండే సెక్రటరీ జిల్లాలోని  కార్యకలాపాలను పరిశీలిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీడీ స్థాయిలో ఉండే ఆర్‌.సంతోష్‌ కుమార్‌ ఉమ్మడి జిల్లా డీఎంఓగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

 
జీఓ నిజమే.. కానీ ఇంకా అమలుకాలేదు 

ఉమ్మడి జిల్లాల వారీగా మార్కెటింగ్‌ శాఖలను విలీనం చేస్తున్నమాట వాస్తవమే. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీఓ కూడా విడుదలైంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇంకా అమలు కావడం లేదని భావిస్తున్నాం. భవిష్యత్తులో రెండు జిల్లాల కార్యకలాపాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం నుంచే జరుగుతాయి. 
–  జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top