మార్కెట్‌ కమిటీల ఊగిసలాట

Market Charms Posts In Adilabad - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లాలోని పలు మార్కెట్‌ కమిటీలకు పాలక వర్గాల ఏర్పాటు ఎటూ తేలకపోవడంతో ఊగిసలాట నెలకొంది. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు చైర్మన్, సభ్యుల పదవులను ఆశిస్తున్న ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు.. ముందస్తు ఎన్నికలు వచ్చి ఒకవేళ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే ఇక ఈ కమిటీల ఏర్పాటు మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఆశావహులు కమిటీల ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో రాజకీయ ఒత్తిడి తీసుకొస్తున్నారు. తక్షణం నిర్ణయం జరిగితేనే కొత్త కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో వారికి ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే కొన్ని కమిటీలకు ఇటీవలే పాలకవర్గాల నియామకం జరగడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోపక్క అక్టోబర్, నవంబర్‌లో పాలక వర్గాల గడువు ముగిసే కమిటీల్లో ఇప్పుడే ఆందోళన మొదలైంది. కారణం ముందస్తు ఎన్నికలు వస్తే మళ్లీ కమిటీ ఏర్పాటుకు నిరీక్షించక తప్పదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.

ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలో 17 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉండగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం రోస్టర్‌ పాయింట్‌ విధానంలో పాలక వర్గాలను  నియమిస్తుంది. ఇటీవల ఐదు కమిటీలకు కొత్తగా పాలక వర్గాలు నియామకం జరిగింది. నిర్మల్, సారంగాపూర్‌ మార్కెట్‌ కమిటీల్లో ఓసీల నియామకం జరగగా, బోథ్, జన్నారంలో బీసీ అభ్యర్థులు, జైనథ్‌లో ఎస్సీ అభ్యర్థి కొత్తగా చైర్మన్‌గా నియామకం జరిగింది. ఇక రెండేళ్ల కిందట ఏర్పాటైన నాలుగు పాలక వర్గాలకు ఈ అక్టోబర్, నవంబర్‌లో గడువు ముగియనుంది. మరో తొమ్మిది కమిటీలకు ఇదివరకే పదవీకాలం ముగిసి పర్సన్‌ ఇన్‌చార్జీలుగా మార్కెట్‌ కమిటీ అధికారులు కొనసాగుతున్నారు. కొత్త కమిటీలు ఏర్పాటైనచోట పాలక వర్గాలు ఊపిరి పీల్చుతుండగా, ఇప్పుడు పర్సన్‌ ఇన్‌చార్జీలు, రెండుమూడు నెలల్లో గడువు ముగియనున్న పాలక వర్గాల్లో ఒక రకమైన దడ మొదలైంది.

ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఇక పాలక వర్గాలు ఊసెత్తని పరిస్థితి ఉంటుంది. దీంతో పాలకవర్గాల ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా పదవీకాలం ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పక్షంలో వెనువెంటనే ఏర్పాటయ్యే అవకాశం ఉండేది. అయితే అక్కడక్కడ పాలక వర్గాల చైర్మన్‌లతో ఎమ్మెల్యేలకు పొసగకపోవడం, ఇతర నాయకులు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోస్టును ఆశించడం, తదితర  కారణాలతో కొత్త కమిటీల ఏర్పాటు విషయంలో దాటవేస్తూ వచ్చారు. అయితే ఉన్నట్టుండిగా ముందస్తు ఎన్నికల సందడి మొదలవ్వడం, అతి త్వరలోనే ప్రభుత్వాన్ని రద్దు చేసే పరిస్థితి కనిపించడంతో ఆశావహులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా జైనథ్‌ మార్కెట్‌ కమిటీని సోమవారం హడావిడిగా ప్రకటించడం కూడా ఇదే కోవలోకి వస్తుంది.

మార్కెట్ల వారీగా పరిస్థితి..
∙ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఆరె రాజన్న కొనసాగుతున్నారు. 2016 అక్టోబర్‌ 7న చైర్మన్‌గా ఎన్నికైన ఆయనకు ఏడాది పదవీకాలం 2017తో ముగిసింది. ఆరు నెలల చొప్పున రెండుసార్లు పదవీ కాలాన్ని పొడగించడంతో ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు. అక్టోబర్‌లో పదవీకాలం ముగియనుంది. మంత్రి జోగు రామన్న ఆశీస్సులు ఉండడంతో మరోసారి కూడా ఆయనే కొనసాగుతారనే ప్రచారం కొనసాగింది. తాజాగా ముందస్తు ఎన్నికల హడావిడి మొదలుకావడంతో డోలయానం కనిపిస్తోంది. ఇంద్రవెల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా రాథోడ్‌ వసంత్‌రావు కొనసాగుతున్నారు. అక్టోబర్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది. జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా భగవంత్‌రావు కొనసాగుతున్నారు. నవంబర్‌ వరకు ఆయన పదవీకాలం ఉంది. ముందస్తు ఎన్నికలు వచ్చి కోడ్‌ అమల్లోకి వస్తే ఇక మళ్లీ కొత్త పాలకవర్గం కొత్త ప్రభుత్వంలోనే ఏర్పడే పరిస్థితి ఉంటుంది. 

  • ఇచ్చోడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఆడె శీల కొనసాగుతున్నారు. అక్టోబర్‌ 17 వరకు ఆమె పదవీకాలం ఉంది. ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేష్‌ అనుచరులైన ఈమె ఏడాది పదవీకాలం పూర్తిచేసుకొని మరో ఆరు నెలల గడువు పొడగించడం ద్వారా కొనసాగుతున్నారు. 
  • భైంసాలో గత జూన్‌లోనే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న రుక్మాబాయి పదవీకాలం ముగి సింది. సెలక్షన్‌ గ్రేడ్‌ ఏఎంసీ అయిన భైంసాలో వరంగల్‌ జేడీ పర్సన్‌ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. ఇక్కడ రుక్మాబాయి రెండేళ్ల పాటు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 
  • ఆసిఫాబాద్‌లో రెండవసారి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పదవి పొడగించకపోయినప్పటికి గత అక్టోబర్‌ నుంచి నాన్‌ ఆఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా గందం శ్రీనివాస్‌ కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి అనుచరుడిగా ఉన్న ఆయన ఏడాది పదవి కాలం తర్వాత ఒక్కసారి మాత్రమే ఆరు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించుకోగలిగారు.
  • మంచిర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న సాగి వెంకటేశ్వర్‌రావు పదవీకాలం ఏడాదిన్నర పాటు సాగింది. ఆ తర్వాత రాజకీయంగా కొంత నేతలతో విభేదాల కారణంగా ఆయన పదవికి దూరమయ్యారు. మరో ఆరు నెలల పదవీకాలం పొడగించలేదు. ప్రస్తుతం పర్సన్‌ ఇన్‌చార్జీగా మార్కెటింగ్‌ అధికారులు ఉన్నారు.
  • కాగజ్‌నగర్‌లో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న పద్మ ఏడాది మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత పదవీకాలం పొడగించకపోవడంతో అక్కడ పర్సన్‌ ఇన్‌చార్జీ కొనసాగుతున్నారు. 
  • ఖానాపూర్‌లో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న నల్ల శ్రీనివాస్‌ పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో పూర్తయ్యింది. మరోసారి కొత్త జీఓ ద్వారా పదవి మళ్లీ పొందాలని ఆశపడుతున్న శ్రీనివాస్‌ ఆశలు ఏమవుతాయో చూడాల్సిందే. వారం రోజుల్లో జీఓ వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
  • చెన్నూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఇస్మాయిల్‌ జుల్ఫేఖార్‌ పదవీకాలం జూన్‌లో పూర్తయ్యింది. ఇక్కడ డీఎంఓ పర్సన్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. 
  • లక్సెట్టిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న బియ్యాల తిరుపతి పదవీకాలం ఫిబ్రవరిలో పూర్తయ్యింది. ఒకటిన్నర సంవత్సరాల పాటు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. రెండోసారి పొడగింపు రాకపోవడంతో ఆయన పదవికి దూరమయ్యారు. పర్సన్‌ ఇన్‌చార్జీ మార్కెటింగ్‌ అధికారి కొనసాగుతున్నారు.
  • కుభీర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పి.లక్ష్మిబాయి పదవీకాలం జూన్‌ 15తో పూర్తయ్యింది. పర్సన్‌ఇన్‌చార్జీగా డీఎంఓ శ్రీనివాస్‌ ఉన్నారు. 
  • బెల్లంపల్లిలో చైర్మన్‌గా ఉన్న చిలువేరు నర్సిములు పదవీకాలం జూలై 27న పూర్తయ్యింది. రెండోసారి పదవి పొడిగింపు రాలేదు.
  • బోథ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా రాసం దేవ్‌రావు, నిర్మల్‌ చైర్మన్‌గా ధర్మాజిగారి రాజేందర్, సారంగాపూర్‌ చైర్మన్‌గా రాజ్‌మహ్మద్, జన్నారం చైర్మన్‌గా ముత్యం సతీష్, జైనథ్‌ చైర్మన్‌గా ముక్కెర ప్రభాకర్‌ నియమితులయ్యారు. బోథ్‌లో ఆగస్టు, నిర్మల్, జన్నారంలో జూలై, సారంగాపూర్‌లో జూన్, జైనథ్‌లో గడిచిన సోమవారం చైర్మన్‌లుగా నియమితులయ్యారు. ఏడాది పాటు పదవిలో ఉంటారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top