breaking news
Market chairman post
-
మార్కెట్ కమిటీల ఊగిసలాట
సాక్షి,ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలోని పలు మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల ఏర్పాటు ఎటూ తేలకపోవడంతో ఊగిసలాట నెలకొంది. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు చైర్మన్, సభ్యుల పదవులను ఆశిస్తున్న ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు.. ముందస్తు ఎన్నికలు వచ్చి ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఇక ఈ కమిటీల ఏర్పాటు మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఆశావహులు కమిటీల ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో రాజకీయ ఒత్తిడి తీసుకొస్తున్నారు. తక్షణం నిర్ణయం జరిగితేనే కొత్త కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో వారికి ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే కొన్ని కమిటీలకు ఇటీవలే పాలకవర్గాల నియామకం జరగడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోపక్క అక్టోబర్, నవంబర్‌లో పాలక వర్గాల గడువు ముగిసే కమిటీల్లో ఇప్పుడే ఆందోళన మొదలైంది. కారణం ముందస్తు ఎన్నికలు వస్తే మళ్లీ కమిటీ ఏర్పాటుకు నిరీక్షించక తప్పదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఇదీ పరిస్థితి.. ఉమ్మడి జిల్లాలో 17 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా, టీఆర్ఎస్ ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్ విధానంలో పాలక వర్గాలను నియమిస్తుంది. ఇటీవల ఐదు కమిటీలకు కొత్తగా పాలక వర్గాలు నియామకం జరిగింది. నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీల్లో ఓసీల నియామకం జరగగా, బోథ్, జన్నారంలో బీసీ అభ్యర్థులు, జైనథ్‌లో ఎస్సీ అభ్యర్థి కొత్తగా చైర్మన్‌గా నియామకం జరిగింది. ఇక రెండేళ్ల కిందట ఏర్పాటైన నాలుగు పాలక వర్గాలకు ఈ అక్టోబర్, నవంబర్‌లో గడువు ముగియనుంది. మరో తొమ్మిది కమిటీలకు ఇదివరకే పదవీకాలం ముగిసి పర్సన్ ఇన్‌చార్జీలుగా మార్కెట్ కమిటీ అధికారులు కొనసాగుతున్నారు. కొత్త కమిటీలు ఏర్పాటైనచోట పాలక వర్గాలు ఊపిరి పీల్చుతుండగా, ఇప్పుడు పర్సన్ ఇన్చార్జీలు, రెండుమూడు నెలల్లో గడువు ముగియనున్న పాలక వర్గాల్లో ఒక రకమైన దడ మొదలైంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఇక పాలక వర్గాలు ఊసెత్తని పరిస్థితి ఉంటుంది. దీంతో పాలకవర్గాల ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా పదవీకాలం ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పక్షంలో వెనువెంటనే ఏర్పాటయ్యే అవకాశం ఉండేది. అయితే అక్కడక్కడ పాలక వర్గాల చైర్మన్లతో ఎమ్మెల్యేలకు పొసగకపోవడం, ఇతర నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టును ఆశించడం, తదితర కారణాలతో కొత్త కమిటీల ఏర్పాటు విషయంలో దాటవేస్తూ వచ్చారు. అయితే ఉన్నట్టుండిగా ముందస్తు ఎన్నికల సందడి మొదలవ్వడం, అతి త్వరలోనే ప్రభుత్వాన్ని రద్దు చేసే పరిస్థితి కనిపించడంతో ఆశావహులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా జైనథ్ మార్కెట్ కమిటీని సోమవారం హడావిడిగా ప్రకటించడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. మార్కెట్ల వారీగా పరిస్థితి.. ∙ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఆరె రాజన్న కొనసాగుతున్నారు. 2016 అక్టోబర్ 7న చైర్మన్‌గా ఎన్నికైన ఆయనకు ఏడాది పదవీకాలం 2017తో ముగిసింది. ఆరు నెలల చొప్పున రెండుసార్లు పదవీ కాలాన్ని పొడగించడంతో ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు. అక్టోబర్‌లో పదవీకాలం ముగియనుంది. మంత్రి జోగు రామన్న ఆశీస్సులు ఉండడంతో మరోసారి కూడా ఆయనే కొనసాగుతారనే ప్రచారం కొనసాగింది. తాజాగా ముందస్తు ఎన్నికల హడావిడి మొదలుకావడంతో డోలయానం కనిపిస్తోంది. ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రాథోడ్ వసంత్‌రావు కొనసాగుతున్నారు. అక్టోబర్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా భగవంత్‌రావు కొనసాగుతున్నారు. నవంబర్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ముందస్తు ఎన్నికలు వచ్చి కోడ్ అమల్లోకి వస్తే ఇక మళ్లీ కొత్త పాలకవర్గం కొత్త ప్రభుత్వంలోనే ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఆడె శీల కొనసాగుతున్నారు. అక్టోబర్ 17 వరకు ఆమె పదవీకాలం ఉంది. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ అనుచరులైన ఈమె ఏడాది పదవీకాలం పూర్తిచేసుకొని మరో ఆరు నెలల గడువు పొడగించడం ద్వారా కొనసాగుతున్నారు. భైంసాలో గత జూన్‌లోనే మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న రుక్మాబాయి పదవీకాలం ముగి సింది. సెలక్షన్ గ్రేడ్ ఏఎంసీ అయిన భైంసాలో వరంగల్ జేడీ పర్సన్ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. ఇక్కడ రుక్మాబాయి రెండేళ్ల పాటు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆసిఫాబాద్‌లో రెండవసారి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పదవి పొడగించకపోయినప్పటికి గత అక్టోబర్ నుంచి నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జిగా గందం శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి అనుచరుడిగా ఉన్న ఆయన ఏడాది పదవి కాలం తర్వాత ఒక్కసారి మాత్రమే ఆరు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించుకోగలిగారు. మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సాగి వెంకటేశ్వర్రావు పదవీకాలం ఏడాదిన్నర పాటు సాగింది. ఆ తర్వాత రాజకీయంగా కొంత నేతలతో విభేదాల కారణంగా ఆయన పదవికి దూరమయ్యారు. మరో ఆరు నెలల పదవీకాలం పొడగించలేదు. ప్రస్తుతం పర్సన్ ఇన్‌చార్జీగా మార్కెటింగ్ అధికారులు ఉన్నారు. కాగజ్‌నగర్‌లో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న పద్మ ఏడాది మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత పదవీకాలం పొడగించకపోవడంతో అక్కడ పర్సన్ ఇన్చార్జీ కొనసాగుతున్నారు. ఖానాపూర్‌లో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న నల్ల శ్రీనివాస్ పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో పూర్తయ్యింది. మరోసారి కొత్త జీఓ ద్వారా పదవి మళ్లీ పొందాలని ఆశపడుతున్న శ్రీనివాస్ ఆశలు ఏమవుతాయో చూడాల్సిందే. వారం రోజుల్లో జీఓ వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఇస్మాయిల్ జుల్ఫేఖార్ పదవీకాలం జూన్‌లో పూర్తయ్యింది. ఇక్కడ డీఎంఓ పర్సన్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న బియ్యాల తిరుపతి పదవీకాలం ఫిబ్రవరిలో పూర్తయ్యింది. ఒకటిన్నర సంవత్సరాల పాటు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. రెండోసారి పొడగింపు రాకపోవడంతో ఆయన పదవికి దూరమయ్యారు. పర్సన్ ఇన్చార్జీ మార్కెటింగ్ అధికారి కొనసాగుతున్నారు. కుభీర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పి.లక్ష్మిబాయి పదవీకాలం జూన్ 15తో పూర్తయ్యింది. పర్సన్ఇన్చార్జీగా డీఎంఓ శ్రీనివాస్ ఉన్నారు. బెల్లంపల్లిలో చైర్మన్‌గా ఉన్న చిలువేరు నర్సిములు పదవీకాలం జూలై 27న పూర్తయ్యింది. రెండోసారి పదవి పొడిగింపు రాలేదు. బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రాసం దేవ్‌రావు, నిర్మల్ చైర్మన్‌గా ధర్మాజిగారి రాజేందర్, సారంగాపూర్ చైర్మన్‌గా రాజ్‌మహ్మద్, జన్నారం చైర్మన్‌గా ముత్యం సతీష్, జైనథ్ చైర్మన్‌గా ముక్కెర ప్రభాకర్ నియమితులయ్యారు. బోథ్‌లో ఆగస్టు, నిర్మల్, జన్నారంలో జూలై, సారంగాపూర్‌లో జూన్, జైనథ్‌లో గడిచిన సోమవారం చైర్మన్లుగా నియమితులయ్యారు. ఏడాది పాటు పదవిలో ఉంటారు. -
పెండింగ్‌లో మార్కెట్ కమిటీ
దేవరకొండ : రెండేళ్లుగా ఖాళీగా ఉన్న దేవరకొండ మార్కెట్ చైర్మన్ పదవికి ఎవరిని నియమించాలన్న అంశం ఇంకా డోలయామానంగా ఉంది. ఈ పదవికి పోటీ ఉండడంతో ఇప్పటికే రెండు కమిటీలు ముగియాల్సి ఉండగా ఇప్పటికీ చైర్మన్ సీటు ఖాళీగానే ఉంది. గత ఎన్నికల అనంతరం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దయిన కమిటీ స్థానంలో మరో నూతన కమిటీని ఎంపిక చేయాల్సి ఉండగా, పదవీ కాలం పొడగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ కమిటీ కార్యవర్గాలన్నీ కోర్టును ఆశ్రయించాయి. దీంతో వారి పదవీ కాలాన్ని ఆరు నెలలకు పొడగించారు. 2015 చివర నుంచి చైర్మన్ సీటు ఖాళీగానే ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చాలాచోట్ల మార్కెట్ కమిటీల ఎంపిక జరిగింది. కానీ దేవరకొండ స్థానంలో ఉన్న పోటీ కారణంగా మార్కెట్ కమిటీకి ఎవరిని నియమించాలన్న అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకపోవడం, రాజకీయ జోక్యం బాగా ఉండడంతో ఈ కమిటీపై తాత్సారం నడుస్తోంది. ముందు ఇచ్చిన మాటకే.. గతేడాది నుంచి మార్కెట్ కమిటీ కోసం చాలా మంది పోటీపడుతూ వచ్చారు. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానానికి గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరికి మాట ఇచ్చి ఉండడం, స్థానికంగా టీఆర్ఎస్ నాయకులు ఆ పేరును ప్రతిపాదించకపోవడంతో కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే స్థానిక నాయకులు ఇప్పటికే మంత్రి, కేసీఆర్‌కు ఈ స్థానంపై తమకు ఆమోదయోగ్యమైన వ్యక్తుల పేర్లను ప్రతిపాదించారు. కానీ ముందుగానే సీఎం ఒక నిర్ణయానికి రావడంతో ఆ పదవి స్థానిక నేతలు ఆశించిన వారికి దక్కకుండాపోయింది. దాదాపు ఖరారైన కమిటీ అయితే దేవరకొండ మార్కెట్ కమిటీకి స్థానికంగా హన్మంతు వెంకటేశ్‌గౌడ్, ఏవీ రెడ్డి, బండారు బాలనర్సింహా, గాజుల ఆంజనేయులు, నాయిని మాధవరెడ్డి, రాంబాబు తదితరులు పోటీ పడుతూ వచ్చారు. కానీ ప్రభుత్వం మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న బండారు బాలనర్సింహాకు ఇవ్వడానికి మొగ్గుచూపుతూ వచ్చింది. అయితే స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్లు మాత్రం చెరో వ్యక్తుల పేర్లను మంత్రి, ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారు. అయినప్పటికీ ఈ పదవి బండారు బాలనర్సింహాకు ఇవ్వడానికే హైకమాండ్ మొగ్గుచూపింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జెడ్పీ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్ మినహా మిగతా కార్యవర్గాన్ని సూచించాల్సిందిగా కోరడంతో వారిరువురూ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్, డైరెక్టర్లు, ట్రెడర్ల పేర్లను ప్రతిపాదించారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్ పదవిని నాయిని మాధవరెడ్డికి, మరో ఆరుగురు డైరెక్టర్లను, ట్రెడర్లను సూచిస్తూ ఏడీఎం కార్యాలయం నుంచి స్థానిక మార్కెట్ కార్యదర్శికి ఒక లేఖతో పాటు సదరు వ్యక్తులకు సంబంధించి వ్యవసాయ ధ్రువీకరణ పత్రాలను పంపాల్సిందిగా కోరుతూ రాతపూర్వక ఆదేశాలు పంపారు. -
రాజుగారింటికి వెళ్లిన మంత్రి..!
► హిరమండలం ఏఎంసీ పోస్టుపై రగడ ► ఇన్చార్జిని కాదని మంత్రి ఒత్తిళ్లు ► సీఎం వద్ద ఇతరుల గోడు ► శత్రుచర్లకే సీఎం మద్దతు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పొరుగూళ్లలో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న పంచాయితీలకు చెక్‌పడింది. తనకు అనుకూలురుకే పదవులు కట్టబెట్టాలని పట్టుబట్టడం... ఇతర ప్రజాప్రతినిధులను తూలనాలడం తదితర అంశాలు సీఎం దృషికి వెళ్లాయి. అన్ని విషయాల్లోనూ తలదూర్చవద్దంటూ సీఎం నేరుగా మంత్రికి మందలించినట్టు సమాచారం. హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పోస్టు పదవిపై నేతల మధ్యనలుగుతున్న విభేదాలకు సీఎం ముగింపు పలికినట్టు తెలిసింది. ఇదీ కథ కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాలకు సంబంధించి హిరమండలంలో మార్కెట్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టు భర్తీకి పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కె.మన్మథరావు అనే వ్యక్తికి మద్దతిస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని బలపరుస్తూ హైదరాబాద్‌లోని చినాబబు లోకేష్, సీఎం కార్యాలయానికీ జాబితా పంపించారు. కొన్నాళ్ల తరువాత ఈ విషయమై మళ్లీ రగడ ప్రారంభమైంది. టీడీపీ మండలాధ్యక్షుడు యాళ్ల నాగేశ్వరరావును ఏఎంసీ చైర్మన్‌గా నియమించాలంటూ ఎంపీ రామ్మోహన్నాయుడు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. అంతే కాకుండా దివంగత ఎర్రన్నాయుడి మనిషిగా నాగేశ్వరరావే సరైన అభ్యర్థి అంటూ ప్రచారం చేసేసి దాదాపు పోస్టును ఖరారు చేసేశారు. దీంతో విజయరామరాజు, మంత్రి అచ్చెన్నల మధ్య మాటల యుద్ధం నడిచింది. తాను చెప్పిందే వేదం అంటూ అచ్చెన్న వ్యవహరించడంపై పంచాయితీ సీఎం వద్దకు చేరింది. శత్రుచర్ల కూడా తానేమీ తక్కువ కాదంటూ మన్మథరావు పేరును ఖరారు చేస్తూ తనకు మద్ధతివ్వాల్సిందిగా పలాస ఎమ్మెల్యే శివాజీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంక ట్రావు, ప్రభుత్వ విప్ కూనరవి కుమార్‌లను ఆశ్రయించారు. వీరంతా కలిసి శత్రుచర్లను వెంటబెట్టుకుని సీఎం వద్దకు తీసుకువెళ్లడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇన్చార్జిదే బాధ్యత మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాల విషయంలో స్థానిక ఇన్చార్జి/ఎమ్మెల్యేలదే బాధ్యత అంటూ సీఎం సున్నితంగా చెప్పినట్టు తెలిసింది. అంతే కాకుండా జిల్లా వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ అచ్చెన్నకు హితవు పలికినట్టు సమాచారం. రాజాం, పాలకొండ ప్రాంతాల్లో పర్యటించే సమయాల్లో అక్కడి ఇన్చార్జిల మాట వింటున్నప్పుడు పాతపట్నం విషయానికొచ్చేసరికి ఎందుకలా చేస్తున్నారంటూ అచ్చెన్నపై సీఎం చిందులేసినట్టు భోగట్టా. తక్షణం రాజుగారింటికి వెళ్లి సమస్య పరిష్కరించాలని కూడా సూచించారని సమాచారం. దీంతో ఇటీవల మంత్రి అచ్చెన్న పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి శత్రుచర్ల ఇంటికి పరామర్శ పేరిట వెళ్లి హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో తాను తలదూర్చానని వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ విప్ సహా ఇద్దరు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు శత్రుచర్లవైపే మొగ్గుచూపడం కూడా మంత్రి అచ్చెన్నకు కాస్త ఇబ్బందిగానే మారింది. మన్మథరావు కూడా మంచి వ్యక్తేనని, గతంలో ఎల్‌ఎన్‌పేట పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని అంతా తేల్చిచెప్పడంతో హిరమండలం ఏఎంసీ పోస్టు దాదాపు ఖరారైనట్టేనని, సమస్య కూడా ముగిసిపోయినట్టేనని టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు.