మావోయిస్టు పార్టీకి 15 ఏళ్లు

Maoist Party Faced Ups And Downs Last 15 Years - Sakshi

రేపటి నుంచి ఆవిర్భావ వారోత్సవాలు

పెద్దపల్లి: పీపుల్స్‌వార్‌ పార్టీ, బిహార్‌కు చెందిన కమ్యూనిస్టు సెంటర్‌ మావోయిస్టు (ఎంసీసీ) పార్టీలు విలీనమై సెప్టెంబర్‌ 21కి 15 ఏళ్లు నిండనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్‌ పార్టీగా కొండపల్లి సీతరామయ్య నాయకత్వంలో అవతరించిన ఆ పార్టీ 2004, సెప్టెంబర్‌ 21న బిహార్‌ ఎంసీసీని తనలో విలీనం చేసుకొని మావోయిస్టు పార్టీగా అవతరించింది. 1979లో జగిత్యాల జైత్రయాత్ర అనంతరం మావోయిస్టు పార్టీని కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, చత్తీశ్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరిస్తూ వివిధ రాష్ట్రాలకు పాకింది. అప్పటికే బీహర్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో పీపుల్స్‌వార్‌ పేరిట నక్సలైట్ల కార్యకలపాలు కొనసాగుతుండగా కిషన్‌దా నాయకత్వంలోని ఎంసీసీ ఆ రాష్ట్రాల్లో పనిచేస్తుంది.

ఎంసీసీ, పీపుల్స్‌వార్‌ పార్టీల మధ్య చర్చలు ముగిసి ఏకాభిప్రాయానికి రావడంపై ఎంసీసీని పీపుల్స్‌వార్‌లో కలుపుకుని మావోయిస్టు పార్టీగా ప్రకటించారు. సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2004లో శాంతి చర్చలను జరుపుకున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న సమయంలోనే నక్సల్స్‌ అగ్రనేతలు రామకృష్ణ, సుధాకర్‌ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ పార్టీ ఇకపై మావోయిస్టు పార్టీగా కొనసాగుతుందని ప్రకటించారు. ఎంసీసీ కంటే ముందు బీహర్, బెంగాల్, శ్రీకాకుళంలలో పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సీపీఐఎంఎల్‌ పార్టీ యూనిటీ సైతం మావోయిస్టుపార్టీలో అప్పటికే విలీనమైనట్లు చర్చల సందర్భంగా రామకృష్ణ వెల్లడించారు. మొదటి దఫా శాంతి చర్చలు ముగిసిన అనంతరం మావోయిస్టులు తిరిగి అజ్ఞాతవాసం వెళ్లారు. శాంతిచర్చలకు సైతం 15ఏళ్లు నిండినట్లు చెప్పుకోవచ్చు.  

మావోయిస్టులపై సర్కార్‌ ముప్పేట దాడి..
పీపుల్స్‌వార్‌పార్టీగా కార్యకలాపాలు కొనసాగించిన సమయంలో కంటే మావోయిస్టు పార్టీగా ఏర్పాటైన తర్వాత ఏకంగా అన్ని రాష్ట్రాల నుంచి నిఘా వర్గాలు మావోయిస్టు పార్టీపై ఒత్తిడి పెంచాయి. జాతీయస్థాయిలో మావోయిస్టుల బలం పెరుగుతుందనే సాంకేతం బయటకు రావడంతో మావోయిస్టుల కట్టడికి అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రం సైతం బలగాలను రాష్ట్రాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగానే అప్పటివరకు తెలంగాణలో బలంగా ఉన్న పీపుల్స్‌వార్‌ పార్టీ (మావోయిస్టులు) కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ లాంటి జిల్లాలతోపాటు నల్లమలను సైతం మావోయిస్టులు కొల్పోయారు. అప్పటి నుంచే క్రమంగా పోలీసులు మావోయిస్టు పార్టీ అగ్రనేతల పై గురిపెట్టి ఒక్కొక్కరినీ ఎన్‌కౌంటర్లతో మట్టుబెట్టారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగిలాయి.

మావోయిస్టు పార్టీ కార్యదర్శి రామకృష్ణ బదిలీ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన బుర్ర చిన్నన్న, శాఖమూరి అప్పారావు, పటేల్‌ సుధాకర్‌రెడ్డి, నల్లమల్ల సాగర్, దేవేందర్‌ ఇలా వరుసగా రాష్ట్ర పార్టీ కార్యదర్శులంతా ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. క్రమంగా తెలంగాణ మైదాన ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీ ఉనికి దెబ్బతీశామని పోలీసు యంత్రాంగం భావిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తలపెట్టిన ఆవిర్భావ వారోత్సవాలు తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో ప్రభావం ఉండదని, అటవీ ప్రాంతాల్లో మాత్రమే అంతంత మాత్రమే వారోత్సవాల నేపథ్యంలో కదలికలు ఉంటాయన్న అభిప్రాయంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top