సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాం

Mancherial Officers Assure To Give Safer Destinations To Travellers - Sakshi

ప్రయాణికులకు ఇబ్బందులు కలగనివ్వం

రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌

సాక్షి, మంచిర్యాల: ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రవాణా శాఖా డిప్యూటీ కమిషనర్‌ (డీటీసీ) డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం మంచిర్యాల ఆర్టీసీ డిపోకు విచ్చేసిన ఆయన ఆర్టీసీ బస్సుల బంద్‌ సందర్భంగా రవాణా శాఖా, రెవెన్యూ, పోలీస్‌ శాఖా ఆధ్వర్యంలో రవాణా ఏర్పాట్లను సమీక్షించారు. రవాణా శాఖా ఆధ్వర్యంలో బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం చేపడుతున్న సౌకర్యాలు, ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో చేపడుతున్న సౌకర్యాలను డీటీసీ దృష్టికి తీసుకువచ్చారు. డీటీసీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, మంచిర్యాల డిపో నుంచి జిల్లా వ్యాప్తంగా మొత్తం 176 వాహనాలను సమకూర్చి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నామని అన్నారు.

ఆర్టీసీ నుంచి 40 బస్సులు, 50 అద్దె బస్సులు, 18 ప్రైవేట్‌ బస్సులు, 20 విద్యా సంస్థల బస్సులు, 60 వరకు టాటా ఏస్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, సెవెన్‌ సీటర్‌ ఆటోలు నడుస్తున్నాయని తెలిపారు. బస్సులు నడిపేందుకు 300 మంది డ్రైవర్లు, 200 మంది కండక్టర్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోగా 60 మంది డ్రైవర్లు, 40 మంది కండక్టర్లను ఎంపిక చేశామని అన్నారు. హెవీ లైసెన్స్, డ్రైవింగ్‌లో ఉన్న సీనియారిటీ ఆధారంగా డ్రైవర్ల ఎంపిక చాలా పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. నిబంధనల మేరకే రవాణా చార్జీలు వసూలు చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు అసభ్యకరంగా ప్రవర్తించినా, రాష్‌ డ్రైవింగ్‌ చేసినా, ఓవర్‌ స్పీడ్‌తో వాహనాలు నడిపినా ప్రయాణికులు వెంటనే పోలీస్‌ 100తో పాటు కంట్రోల్‌ రూం హెల్ప్‌లైన్‌ 9959226004 నంబర్‌కు సమాచారం అందించవచ్చని తెలిపారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖా అధికారి(డీటీఓ) ఎల్‌. కిష్టయ్య, సీనియర్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ) గుర్రం వివేకానంద్‌రెడ్డి, పెద్దపల్లి ఎంవీఐ అల్లె శ్రీనివాస్, రామగుండం ఎంవీఐ రంగారావు, అసిస్టెంట్‌ ఎంవీఐలు కొమ్ము శ్రీనివాస్, నల్ల ప్రత్యూషారెడ్డి, మంచిర్యాల డివిజినల్‌ మేనేజర్‌ సురేశ్‌చౌహాన్, డిపో మేనేజర్‌ మల్లేశ్, హాజీపూర్‌ తహసీల్దార్‌ మహ్మద్‌ జమీర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top