మా బాగోగులు చూసేదెవరు..
రోడ్డు ప్రమాదంలో తల్లి దుర్మరణం
కరోనాతో ఆరేళ్ల క్రితం తండ్రి మృతి..
అనాథలైన ముగ్గురు పిల్లలు
మంచిర్యాల జిల్లా: ‘‘అమ్మా.. నాన్న దగ్గరికి వెళ్లిపోయావా.. మా బాగోగులు చూసేదెవరు.. మా వద్దకు ఎప్పుడొస్తవ్.. పొద్దంతా వరంగల్‌లోని దేవాలయాల వద్దకు తీసుకెళ్లి దర్శనాలు చేయించావు. బాగా చదువుకుని ప్రయోజకులు కావాలన్నావు.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మాకు దూరమయ్యావు.. ఏ దేవునికి అనిపించలేదా..? మాకు దూరం చేయొద్దని..’’ అంటూ ఆ పిల్లలు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఆరేళ్ల క్రితం కరోనా మహమ్మారి తండ్రిని దూరం చేయగా.. రోడ్డు ప్రమాదం రూపంలో తల్లీ దూరమైంది. ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. వేమనపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది.
మండల కేంద్రం వేమనపల్లికి చెందిన మద్దెర్ల పుష్పలత, వెంకటేష్ దంపతులకు ముగ్గురు పిల్లలు నిహాల్, రిషిత్, సహస్ర ఉన్నారు. గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహించే వెంకటేష్ ఆరేళ్ల క్రితం కరోనాతో మృత్యువాత పడ్డాడు. అప్పటి నుంచి సోదరుడు విక్కీ సహాయంతో కిరాణ దుకాణాన్ని పుష్పలత కొనసాగిస్తూ పిల్లలను చదివిస్తోంది. కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఆదివారం సెలవు దినం కావడంతో వరంగల్‌కు వెళ్లిన పుష్పలత ఇంటర్, 8వ తరగతి చదువుతున్న కుమారులు నిహాల్, రిషిత్‌లతో కలిసి అక్కడి వేయి స్తంభాల గుడితోపాటు పలు ఆలయాల్లో దర్శనం చేసుకున్నారు. అనంతరం పిల్లలను హాస్టళ్లలో అప్పగించి తిరుగు ప్రయాణమైంది. ఆమెను తీసుకెళ్లడానికి ఇందారం చౌరస్తా వరకు కారులో వచ్చినట్లు సోదరుడు విక్కీ ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి గోదావరిఖని బస్టాండ్ వరకు వచ్చిన ఆమె అక్కడి నుంచి తెలిసిన వ్యక్తి చెన్నూర్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి అరుణ్‌కుమార్ మోటార్‌సైకిల్‌పై బయల్దేరింది. గోదావరి వంతెన వద్ద చీర కొంగు మోటారు సైకిల్ టైరులో చుట్టుకుని కిందపడి పుష్పలత(40) మృతిచెందింది. గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని వేమనపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. పుష్పలత మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కరోనాతో తండ్రి, ప్రమాదంలో తల్లి మృతిచెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, అరుణ్‌కుమార్‌కు గాయాలైనట్లు తెలిసింది.


