సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందినట్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చేవెళ్ల మండల పరిధిలో సోమవారం వేకువ ఝామున ఈ ఘోరం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఈ వేకువ జామున హైదరాబాద్‌కు బయల్దేరింది. తొలి ట్రిప్పు బస్సు కావడంతో అధిక సంఖ్యలో జనాలు ఎక్కారు. ఈలోపు.. బస్సు మీర్జాగూడ వద్దకు చేరుకోగానే కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఆపై టిప్పర్ ఒరిగిపోవడంతో కంకర లోడ్ మొత్తం బస్సులోకి పడిపోయింది.

తాండూరు బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరిన దృశ్యం
ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసం అయ్యింది. బస్సు, టిప్పర్ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వాళ్లను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు.
ఘటనా స్థలం వద్ద, బస్సుల్లో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. తమను కాపాడాలంటూ కంకరలో కూరుకుపోయిన వాళ్లు వేడుకోవడం.. అచేతనంగా కొందరు పడి ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 32 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.

బస్సులో కంకర మధ్య విగతజీవిగా యువతి.. ఆ వెనక సగం కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్న యువకుడు
కంకర టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్.. అదుపు తప్పి బస్సుపై బోల్లా పడిందని పోలీసులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ఈ తీవ్రత ఎక్కువైందని అంటున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో సిటీ నుంచి వెళ్లినవాళ్లు తిరుగు పయనమైనట్లు స్పష్టమవుతోంది. అందులో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 22 మంది మృతుల్లో 10 మంది మహిళలు, ఒక చిన్నారి, 8 మంది పురుషులు(ఇద్దరు డ్రైవర్లుసహా) ఉన్నారు. మృతుల్లో పది నెలల పసికందు, ఆమె తల్లి కూడా ఉండడం కలిచివేస్తోంది. కేబిన్‌లలో ఇరుక్కుపోయిన టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో 15 మంది ప్రయాణికులను కాపాడగలిగారు. కంకరను పూర్తిగా తొలగించేందుకే జేసీబీ సహాయం తీసుకున్నారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇదిలా ఉంటే.. సహయ చర్యల్లో పాల్గొన్న సీఐ భూపాల్‌కు గాయాలయ్యాయి. జేసీబీ ఆయన కాలు మీదకు ఎక్కింది. దీంతో ఆయనకు చికిత్స అందించారు. ఇక ఈ ప్రమాదం వల్ల చేవెళ్ల-వికారాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు కిలోమీటర్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అధికారులు రంగంలోకి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు.


