భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తున్న భర్త.. పిల్లల వైద్యం కోసం తండ్రి.. అక్షర యాత్రకు బయలుదేరిన ఓ చదువుల తల్లి.. జీవనపోరాటంలో ఆకలి తీర్చుకునేందుకు శ్రమను వెతుక్కుంటూ ప్రయాణిస్తున్న మరెన్నో జీవితాలు.. క్షణ కాలంలో విధి ఆడిన వింత నాటకంలో సజీవ సమాధి అయ్యాయి. మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఒక్కొక్కరిదీ ఓ కన్నీటి గాథ. కన్నవారిని దూరం చేసుకున్న కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి.
ఐఫోన్ కోసం వచ్చి  .. అనంత లోకాలకు 
యాలాలకు చెందిన అలివేలుకు ఓ కొడుకు, కూతురు సంతానం. ఆమె కూతురు అఖిల (22) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఎస్సీ పూర్తి చేసింది. నాలుగు నెలల క్రితం నగరంలోని నానక్‌రాంగూడలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో పీజీడీఎం కోర్సులో చేరింది. ఆమె చదువు కోసం తల్లి ఇటీవలే రూ.12లక్షలు ఫీజు చెల్లించింది. రెండు రోజుల క్రితం కూతురుకు ఐఫోన్ ఇప్పిస్తానని చెప్పడంతో అఖిల స్వగ్రామానికి వచ్చింది. కొత్త ఫోన్ తీసుకుని బస్సు ఎక్కిన ఆ యువతి అంతలోనే అనంత లోకాలకు వెళ్లింది. తల్లి రోదనలకు అంతులేకుండా పోయింది.  

కళ్లెదుటే తండ్రి సజీవ సమాధి 
దౌల్తాబాద్ మండలం ఈటూరుకు చెందిన హన్మంతు (35) కుమారుడు హర్షవర్ధన్ కొంత కాలంగా చెవి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా పాఠశాలలో ఎన్‌సీసీ విభాగంలోకి తీసుకోవడంలేదని నగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు ఎక్కాడు. మార్గ మధ్యలో టిప్పర్ ఢీకొట్టడంతో కొడుకు పక్కనే కూర్చున్న హన్మంతు ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. ఆయనపై మరో ముగ్గురు ప్రయాణికులు పడ్డారు. వారు తేరుకునేలోగా టిప్పర్‌లో ఉన్న కంకర వారిపై పడటంతో హర్షవర్ధన్ కళ్లెదుటే తండ్రి సజీవ సమాధి అయ్యాడు.  

తల్లి మృతి.. తండ్రి ఐసీయూలో
లాలించిన తల్లి తనువు చాలించింది.. నాన్న ఐసీయూలో చేరాడు.. ఏం చేయాలో తోచక చిన్నారులు రోదిస్తున్న తీరు అందరి హృదయాలను కలిచి వేసింది. తాండూరుకు చెందిన అబ్దుల్ మాజీద్ భార్య తబస్సుమ్ కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. దీంతో అబ్దుల్ మాజీద్ భార్య, పిల్లలు మతీన్, ముకురం, మైవిష్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి బయలుదేరారు. ఈ ప్రమాదంలో తబస్సుమ్‌పై కంకర పడి కన్నుమూయగా.. మాజీద్ తీవ్రగాయాలతో చేవెళ్ల పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వికారాబాద్ ఆస్పత్రిలో చికిత్స 
అనంతగిరి: బస్సు ప్రమాదంలో గాయపడిన పలువురిని వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 10మందిని తరలించగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. పట్టణంలోని ఈషా ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స పొందారు. టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ తలకు తీవ్ర గాయాలు కాగా నగరానికి రెఫర్ చేశారు. ప్రమాదంలో అబ్దుల్లా చేయి, సుమయకు కాలు విరిగింది. సయ్యద్ అస్మాకు తలకు, సఫీ, సయ్యద్ అస్మా,  తౌసురా, సోమయ్య, సప్న,  ప్రవీణ గాయపడ్డారు. 8 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈషా ఆస్పత్రిలో పవన్, వాహీద్ చికిత్స పొందుతున్నారు.    
శోకసంద్రంలో పేర్కంపల్లి 
యాలాల: ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందడంతో వారి స్వగ్రామం పేర్కంపల్లి శోక సంద్రంలో మునిగిపోయింది. పేర్కంపల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ కుటుంబం కొన్నేళ్ల క్రితం తాండూరుకు వెళ్లి íస్థిరపడింది. వారికి గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. గ్రామానికి తరచూ వచ్చి వెళ్తుంటారు. కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకు ఊరు విడిచి మృతదేహాలతో గ్రామానికి వచ్చావా అంటూ ఎల్లయ్యగౌడ్‌ను చూసిన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గురి అంత్యక్రియలు సాయంత్రం నిర్వహించారు.  

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
