
లారీడ్రైవర్ నరకయాతన
ఢీకొన్న లారీ, బస్సు
17 మందికి తీవ్ర గాయాలు
వరంగల్ జిల్లాలో ఘటన
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం, మొరిపిరాల మధ్యలో జాతీయ రహదారిపై లారీ, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్, క్లీనర్ తీవ్రగాయాలతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. పోలీసుల కథనం ప్రకారం..
శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు హనుమకొండనుంచి ఖమ్మం వైపు వెళ్తోంది. ఇదే సమయంలో ప్లాస్టిక్ వస్తువుల లోడ్‌తో ఓ లారీ విజయవాడ నుంచి హనుమకొండ వైపు వస్తోంది. ఈ క్రమంలో మైలారం, మొరిపిరాల మధ్యలో బ్రిడ్జి వద్ద గుంతలను తప్పించుకునే క్రమంలో లారీ, బస్సు ఎదురెదు రుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 44 మందిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్పల్ప గాయాలయ్యాయి. అలాగే లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం, వర్ధన్నపేట సీహెచ్‌సీకి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా.. పోలీసులు జేసీబీ సహాయంతో గంటపాటు శ్రమించి క్యాబిన్‌ను విడగొట్టి వారిని బయటకు తీశారు. వైద్యంకోసం వీరిని ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటన తో వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌లకు ఫోన్‌లో ఆదేశించారు.