వంకర.. టింకర.. కంకర.. | Congested Tandur-Hyderabad Road: More than 1500 Lorries and Tankers Commute Daily | Sakshi
Sakshi News home page

వంకర.. టింకర.. కంకర..

Nov 4 2025 6:27 AM | Updated on Nov 4 2025 6:27 AM

Congested Tandur-Hyderabad Road: More than 1500 Lorries and Tankers Commute Daily

రహదారి దుస్థితి ఇదీ..

నిత్యం రద్దీగా తాండూరు - హైదరాబాద్‌ రహదారి 

రోజూ 1,500లకుపైగా లారీలు, ట్యాంకర్ల రాకపోకలు

ఎర్రమట్టి, బండల లారీలు, సిమెంట్‌ ట్యాంకర్ల ఓవర్‌లోడ్‌ 

రహదారి ఘోరంగా దెబ్బతినడానికి ఇదే కారణం 

వాహన తనిఖీలు లేకపోవడంతో ఇష్టానుసారంగా తరలింపు 

భారీగా వ్యక్తిగత వాహనాలు.. నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు

సాక్షి, హైదరాబాద్‌: పాము మెలికల్లా వంకర తిరిగిన ఇరుకు రహదారి.. అత్యంత ప్రమాదకరంగా దూసుకుపోయే వాహనాలు.. పరిమితికి మించి 50 నుంచి 80 టన్నుల లోడుతో లారీల రాకపోకలు. అడుగడుగునా గుంతలు.. ఇదీ హైదరాబాద్‌ తాండూరు రహదారి పరిస్థితి. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం జరిగి 19 మంది ప్రయాణికుల ప్రాణాలు పోవటానికి ఈ రహదారి దుస్థితే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రహదారిపై తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాల ప్రజలు నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీ భారీగా పెరిగింది. రద్దీకి తగినట్టుగా రహదారి విస్తరణకు నోచుకోకపోవటంతో ఈ రహదారిపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సి వస్తోందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

110 కిలోమీటర్లు.. లక్షల్లో గుంతలు 
హైదరాబాద్‌ బీజాపూర్‌ జాతీయ రహదారిలో పోలీస్‌ అకాడమీ (అప్పా) జంక్షన్‌ నుంచి వికారాబాద్‌ జిల్లా మన్నెగూడ వరకు, మన్నెగూడ నుంచి వికారాబాద్‌ మీదుగా తాండూరు వరకు సుమారు 110 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ఈ దారిలో మొయినాబాద్‌ వరకు డివైడర్‌తో నాలుగు వరుసలుగా రహదారి ఇప్పటికే విస్తరించి ఉంది. మొయినాబాద్‌ నుంచి చేవెళ్ల, మన్నెగూడ వరకు పాము వంకలు తిరిగినట్లు ఉంటుంది. కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి అవసరాల మేరకు ఈ రహదారిని నిర్మించారు.

ప్రస్తుతం వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినా విస్తరణకు నోచుకోలేదు. తాండూరు నుంచి సిమెంట్‌ ట్యాంకర్లు, బండలు, పెద్దేముల్‌ నుంచి సుద్ద, వికారాబాద్, మర్పల్లి, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్‌ ప్రాంతాల నుంచి ఎర్రమట్టి లారీలు రోజుకు సుమారు 1,500 వరకు ఈ రోడ్డుపై ప్రయాణిస్తాయి. ఈ వాహనాల్లో పరిమితికి మించి ఓవర్‌లోడ్‌ సర్వసాధారణం. సుమారు 50 నుంచి 80 టన్నుల లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులకు ఈ విషయం తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఓవర్‌లోడ్‌ వాహనాల కారణంగా రహదారిపై లక్షల సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల అడుగు నుంచి రెండు అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో వాహనం దగ్గరకు వచ్చేవరకు ఈ గుంతలు కనిపించవు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కొన్నిసార్లు లారీల సిబ్బందే తాండూరు బండల వ్యర్థాలు, సిమెంటు ట్యాంకర్లలో మిగులును పోసి పూడ్చుతున్నారు. చాలాచోట్ల రోడ్డు కంకర తేలి కనిపిస్తోంది.  

పెరిగిన వ్యక్తిగత వాహనాలు 
వికారాబాద్‌ జిల్లా నుంచి నిత్యం హైదరాబాద్‌కు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర అవసరాలకు వేలాది మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరి అవసరాలకు సరిపడా ఆ­ర్టీసీ బస్సులను నడపటంలేదని ఆ ప్రాంత ప్రజలు అంటున్నా­రు. ఎప్పుడో ఒకసారి వచ్చే బస్సులోనే పరిమితికి మించి 60 నుంచి 90 మంది వరకు ఎక్కి ప్రయాణిస్తున్నారు. ఈ కష్టాలు పడలేనివారు వ్యక్తిగత వాహనాలపై ప్రయాణిస్తున్నా­రు. దీంతో ఈ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.  

నిధులున్నా నీరసమే.. 
తాండూరు నుంచి వికారాబాద్‌ వరకు 40 కిలోమీటర్ల దహదారి విస్తరణకు 2018 ఎన్నికల కంటే ముందే నిధులు మంజూరయ్యాయి. కానీ, నేటికీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. వర్షాకాలంలో ఈ రహదారిపై ప్రయాణించటం నరకమేనని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్‌ నుంచి మన్నెగూడ వరకు పది కిలోమీటర్లు రోడ్డు వేసినా పనుల్లో నాణ్యతా లోపాలు వెక్కిరిస్తున్నాయి. మన్నెగూడ నుంచి అప్పా వరకు 55 కిలోమీటర్లు జాతీయ రహదారుల పరిధిలో ఉంది. దీన్ని 4 వరుసల రహదారిగా అభివృద్థి చేయడానికి ఐదేళ్ల క్రితం రూ.925 కోట్లు మంజూరైనా పనులు మాత్రం పూర్తికాలేదు. వికారాబాద్‌ జిల్లా నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు నిత్యం వేల సంఖ్యలో సరుకు రవాణా వాహనాలు వస్తున్నాయి. అయితే, అవి నిబంధనల మేరకే ఉన్నాయా? లేవా? అనే తనిఖీలు ఎక్కడా కనిపించడంలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement