మూతపడిన ప్రైవేట్ కాలేజీలు
చర్చలకు యాజమాన్యాల నిరాకరణ..పూర్తిగా బకాయిలు ఇస్తేనే సంప్రదింపులు
ప్రస్తుతానికి రూ.300 కోట్లు ఇస్తామంటున్న ప్రభుత్వం
ఇప్పుడు లొంగితే అంతర్గత అలజడి... తేల్చి చెప్పిన యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు ఇచ్చిన పిలుపుతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలన్నీ మూతపడ్డాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతి) ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది. ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్‌తో కలిపి మొత్తం 14 రకాలకు చెందిన 2,500 ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలున్నాయి. దోస్త్‌లేని డిగ్రీ కాలేజీలు, డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీలు,కొన్ని కాలేజీలు కలిపి 400 వరకూ బంద్‌లో పాల్గొనలేదు. పలు జిల్లాల్లో కాలేజీల ఉద్యోగులు గేట్లకు తాళం వేసి, గేటు వద్ద నిరసన తెలిపారు. మరికొన్ని చోట్ల విద్యార్థులు కూడా నిరసనలో పాల్గొన్నారు.
కాస్త తగ్గండి: బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. కాలేజీ యాజమాన్యాలకు ఫోన్లు చేసి, తనిఖీలకు వస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీనికి కాలేజీ యాజమాన్యాలు నిరాకరించాయి. మరోవైపు ప్రభుత్వ స్థాయిలో బుజ్జగింపులు జరిగాయి. ఉన్నతాధికారులు యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా రూ.300 కోట్లు మంజూరు చేస్తామని బంద్‌ను విరమించాలని సీఎం కార్యాలయం యాజమాన్యాలకు ఫోన్లు చేసింది.
ఇంకోవైపు బంద్ లేకుండా సంప్రదింపులు జరపాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది. ఆయన చేసిన ప్రయత్నాలూ కూడా ఫలించలేదు. డబ్బులు ఇవ్వకుండా బంద్ విరమిస్తే ఫతిలో అభిప్రాయభేదాలొస్తాయని, అంతర్గతంగా వ్యతిరేకత పెరుగుతుందని ఫతి నేతలు మండలి చైర్మన్‌కు తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
రాత్రి వరకూ ఫోన్లు
బంద్ విరమిస్తే బకాయిలపై చర్చిస్తామని సోమవారం రాత్రి వరకూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫతి నాయకులకు ఫోన్లు వచ్చాయి. రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సిన చోట రూ.900 కోట్లు ఇస్తామని ఆరు నెలలుగా ప్రభుత్వం ఊరిస్తోందని, గతంలో ఈ మాటలు వినే ఆందోళనను విరమించుకున్నామని, ఈసారి అలా చేస్తే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని కొంతమంది ఫతి నేతలు హెచ్చరించారు. దారికి తెచ్చేందుకు ప్రభుత్వం, తాడోపేడో తేల్చుకోవాల్సిందేనని యాజమాన్యాలు ఉండటంతో కాలేజీల మూత వ్యవహారం ఎంత కాలం కొనసాగుతుందనే ఆందోళన అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
ఆందోళన మరింత తీవ్రతరం : ఫతి అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రమేశ్‌బాబు
ప్రభుత్వం హామీతో సరిపెట్టి డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఫతి అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రమేశ్ అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫతి నేతలు మాట్లాడారు. బకాయిల మొత్తంలో 50 శాతమైనా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీన 30 వేల మంది కాలేజీ సిబ్బందితో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 11వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో రాజధానిలో సభ పెట్టబోతున్నట్టు చెప్పారు. రూ. 300 కోట్లు ఇస్తామని, బంద్ విరమించమంటూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏ కాలేజీ యాజమాన్యం అంగీకరించడం లేదన్నారు. సీబీఐటీ, వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి, మాతృశ్రీ కాలేజీలు బంద్‌లో పాల్గొనలేదని, వారితో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
బ్లాక్ మెయిల్‌కు భయపడేదే లేదు : అల్జాపూర్ శ్రీనివాస్ (ఫతి వైస్ ప్రెసిడెంట్)
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ నిరీ్వర్యం చేయాలని చూస్తోందని ఫతి ఉపాధ్యక్షుడు అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. నిరుద్యోగ యువత స్థాపించిన కాలేజీలు నిధులు లేక అలమటిస్తున్నాయని మొత్తుకుంటుంటే, ప్రభుత్వం విజిలెన్స్ దాడుల పేరుతో బ్లాక్ మొయిల్ చేస్తోందని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సునీల్‌రుమార్, కోశాధికారి కృష్ణారావు, కోఆర్డినేటర్ రాంజాన్, పీజీ కాలేజీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణరెడ్డి , ఫతి నాయకుడు లీలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


