తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు, విద్యార్థులు
కర్కశ సర్కారుపై కదనం
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ధర్నా
తాడేపల్లిలో విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని విద్యార్థి సంఘాల డిమాండ్
దుగ్గిరాల పీఎస్‌కు విద్యార్థి నేతల తరలింపు
సాక్షి,అమరావతి/తాడేపల్లి రూరల్: కర్కశ సర్కారుపై విద్యార్థి దళం గళమెత్తింది. రహదారులపై రణన్నినాదమై గర్జించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణం విడుదల చేయాలని కదంతొక్కింది. చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతిపై కన్నెర్రచేసింది. ఖబడ్దార్ అంటూ హెచ్చరించింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్íÙప్పులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా స్పందించలేదు. దీంతో సోమవారం తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ కార్యాలయ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు.
పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల నుంచి భారీగా తరలివచి్చన విద్యార్థులు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కార్యాలయం వద్ద నుంచి ప్లకార్డులు, బ్యానర్లు, జెండాలు చేతబట్టి ర్యాలీగా పెట్రోల్ బంక్ మీదుగా సాంఘిక సంక్షేమ కార్యాలయ రోడ్డులోకి చొచ్చుకెళ్లారు. దీంతో పోలీసులు లాఠీలను అడ్డుపెట్టి విద్యార్థి నేతలను, విద్యార్థులను అడ్డుకునే యత్నం చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం బారికేడ్లను నెట్టేసి విద్యార్థులు సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు.
‘ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు గేట్ బయటకు నెట్టేయడం అన్యాయం, విద్యార్థులను వేధించటం తగదు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు తక్షణమే చెల్లించాలి, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి, లేకుంటే విద్యార్థుల సత్తా ఏమిటో సర్కారుకు చూపిస్తాం.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’’ అని హెచ్చరించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల నినాదాలతో తాడేపల్లి హోరెత్తింది. అనంతరం పోలీసులు ఐదుగురితో కూడిన విద్యార్థుల ప్రతినిధి బృందాన్ని అధికారుల వద్దకు పంపుతామనటంతో విద్యార్థినేతలు, విద్యార్థులు ఒప్పుకోలేదు. ప్రభుత్వమే దిగివచ్చి తమ సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు తాము ఎక్కడికీ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు.
విద్యార్థి నేతలను ఈడ్చిపడేసిన పోలీసులు
ఆందోళన తీవ్రం కావటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (జోనల్) ఎ.రవిచంద్రతో పాటు మరికొంతమంది విద్యార్థులను ఈడ్చిపడేశారు. వారిని తీసుకెళ్లి ముందే సిద్ధంగా ఉంచిన లారీలోకి ఎక్కించారు. అనంతరం వారిని తెనాలి మార్గంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. చివరికి దుగ్గిరాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి వెంట భారీగా విద్యార్థులు వాహనాల్లో తరలివెళ్లారు.
విద్యాశాఖ మంత్రి విదేశాల్లో చక్కర్లు కొడతారా?
అంతకు ముందు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య నేతృత్వంలో గుంటూరు నుంచి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రవిచంద్ర నేతృత్వంలో విజయవాడ వైపు నుంచి విద్యార్థులు బైక్‌లు, ఇతర వాహనాల్లో భారీ ర్యాలీగా తాడేపల్లికి చేరుకున్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాను ఉద్దేశించి చైతన్య, రవిచంద్ర మాట్లాడారు. దాదాపు ఎనిమిది క్వార్టర్స్ బకాయిలు రూ.7,800 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయాలని, ఇందులో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు.
వీటిని చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు రాష్ట్రంలో విద్యార్థులు కష్టాల్లో ఉంటే విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పోలీసులు పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, నరేందర్ రెడ్డి, బాజీ, రవి తదితరులను అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ధర్నాలో స్టూడెంట్ యూనియన్ నాయకులు నరేంద్రరెడ్డి, గంటి, రవి, పేటేటి నవీన్, వినోద్, కోమల సాయి, రవీంద్రారెడ్డి, సందీప్, రవి, కరీం, కిరణ్, రాజే‹Ù, సతీష్, అజయ్, రామకృష్ణ, మస్తాన్, ప్రభు, హరి, సుభాని, బాలు, అబ్బాస్, సిరాజ్, శ్రీనివాస్, నవీన్, కోమల్ సాయి, సురేష్ పాల్గొన్నారు.
విద్యార్థులపై కేసు నమోదు
తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి విద్యార్థి సంఘ నాయకులు పానుగంటి చైతన్య, నరేంద్రరెడ్డి, అనిల్ కుమార్, రవీంద్ర, రవిచంద్ర విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. వీరిని మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం 8 గంటల సమయంలో మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.
ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం. తక్షణం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించారు, స్కాలర్íÙప్పులూ మంజూరు చేశారు. ఈ సర్కారు వచ్చాక అసలు చెల్లింపులు నిలిపేసింది. విద్యార్థులను చిత్రహింసలు పెడుతోంది. ఈ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతాం. – పానుగంటి చైతన్య, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు
పార్ట్ టైం ఉద్యోగాలకు విద్యార్థులు
చంద్రబాబు సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇతర బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడంతో కాలేజీల యాజమాన్యాల వేధింపులను విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది పరీక్షలకు దూరమయ్యారు. దీంతో కొందరు విద్యార్థులు పార్ట్‌టైం ఉద్యోగాలుచేస్తూ ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. తల్లిదండ్రులు కాలేజీల ఫీజులు చెల్లించేందుకు అప్పులుచేయాల్సి వస్తోంది. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్


