
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాలవాడ రైల్వే ఏ క్యాబిన్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో ఖమ్మం పట్టణానికి చెందిన బెజ్జాల సత్యవతి(55), ఆమె మనవరాలు గీతశిరీష (4) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇదే ఇంట్లో మూడేళ్ల క్రితం సత్యవతి చిన్న కుమారుడు శిరీష (24) ట్రాన్స్‌జెండర్ సైతం అనుమానాస్పదంగా మృతిచెందడం అప్పట్లో కలకలం రేపింది. ప్రస్తుతం నానమ్మ, మనవరాలు మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది.
మంచిర్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని 3టౌన్‌కు చెందిన బెజ్జాల చంద్రయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు గంగోత్రి, వెంకటేశ్ ఉండగా.. చిన్న కుమారుడు వెంకటేశ్ ట్రాన్స్‌జెండర్(శిరీష)గా మారి మంచిర్యాలలో స్థిరపడింది. గోపాలవాడ శివారులో రైల్వే ఏ క్యాబిన్ వద్ద ఓ ఇల్లు నిర్మించుకుని జీవనం సాగించింది. 2022 జనవరి 4న అనుమానాస్పదంగా మృతిచెందింది. అప్పటి నుంచి ట్రాన్స్‌జెండర్ శిరీష కుటుంబ సభ్యులు తరచూ వచ్చి వెళ్తుండేవారు.
ఈ క్రమంలో ఈ నెల 8న గంగోత్రి తన తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషతో కలిసి ట్రాన్స్‌జెండర్ శిరీష ఇల్లు విక్రయించడానికి మంచిర్యాలకు వచ్చారు. 9న తనకు అస్తమా సమస్య వచ్చిందంటూ గంగోత్రి తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషను ఇక్కడే వదిలి ఖమ్మం వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటి వారికి సమాచారం అందించాడు. స్థానికులు వెళ్లి ప రిశీలించగా తలుపులు తీయకపోవడంతో ‘డయల్ 100’కు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా సత్యవతి, గీతశిరీష విగతజీవులుగా కనిపించారు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు పలుసార్లు గంగోత్రికి సమాచారం ఇచ్చి రావాలని సూచించినా రాకపోవడంతో అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
హత్యా..? ఆత్మహత్యా..?
సత్యవతి, గీతశిరీష మృతి హత్యా..? ఆత్మహత్యా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటిని విక్రయించడానికి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు ఇక్కడే ఉండడం, ఒక్కరే వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏం జరిగిందనేది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది.