
సాక్షి, నల్గొండ : నాగార్జుసాగర్ డ్యామ్ వద్ద సోమవారం విషాదం చోటు చేసుకుంది. సాగర్ పర్యటనకు వచ్చిన ఓ వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకోవడంతో అధికారులు ప్రాజెక్టు గెట్లు తెరిచి.. నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఆ దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు సాగర్ బాట పట్టారు. అయితే సాగర్ దిగువన శివాలయం ఘాట్ వద్ద కొందరు వ్యక్తులు ఈతకు దిగారు. అందులో ఓ వ్యక్తి నీటి ప్రవాహంలో చిక్కుకుపోయాడు. చాలా సేపు ఒడ్డుకు చేరేందుకు తీవ్రంగా యత్నించాడు. అయితే పై నుంచి ప్రవాహం అధికంగా ఉండటంతో అతను నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. పక్కన ఉన్నవారు కూడా చేసేది ఏమీ లేక ఉండిపోయారు. గల్లంతైన వ్యక్తిని జహీరాబాద్‌కు చెందిన నరసింహం(41)గా గుర్తించారు. అయితే ప్రమాదం జరగక ముందు నరసింహం తన స్నేహితులతో సరదాగా కలిసి ప్రాజెక్టు పరిసరాల్లో ఫొటోలు దిగారు.