
విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల): నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. సోమవారం సాగర్‌లో 14 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,12,224 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 1,67,448 క్యూసెక్కులు వచ్చి చేరడంతో ఆ మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. ఇక్కడ నుంచి కుడి కాలువకు 9,700, ఎడమ కాలువకు 9,166, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,658, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయ నీటిమట్టం 589.20 అడుగులకు చేరింది.
పులిచింతలకు 1,23,369 క్యూసెక్కులు
నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ ద్వారా 1,23,369 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. గరిష్ట నీటిమట్టం 75.50 మీటర్లు కాగా ప్రస్తుతం 74.48 మీటర్లకు నీటిమట్టం చేరుకున్నట్టు వివరించారు.
రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.066 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి 1,45,882 క్యూసెక్కులు వస్తుందని, పైనుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.