
18 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల
విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. దీంతో మంగళవారం సాగర్‌లో 18 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 18 క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,37,790 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 1,89,344 క్యూసెక్కులు వచ్చి చేరడంతో మొత్తం ఔట్‌ఫ్లోగా 1,89,344 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 5,156, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,698, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 585.80 అడుగులు కాగా ఇది 299.7430 టీఎంసీలకు సమానం.
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద
కృష్ణానదికి ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం బ్యారేజ్‌కు 3,52,772 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇందులో 3,37,525 క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదిలివేస్తున్నారు. మిగిలిన 15,247 క్యూసెక్కులు డెల్టాలోని పంట కాలువలకు వదిలారు.
పులిచింతలకు 1,43,704 క్యూసెక్కులు విడుదల
నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 8 క్రస్ట్‌గేట్లు ద్వారా 1,43,704 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం మంగళవారం తెలిపారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 8 క్రస్ట్‌గేట్లు 3.50 మీటర్లు ఎత్తు ఎత్తి 1,43,704 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటి మట్టం ప్రాజెక్టు 75.50 మీటర్లకు గాను 74.38 మీటర్లకు నీరు చేరుకుందన్నారు.